చరిత్ర తిరగరాసిన జకోవిచ్‌

17 May, 2023 17:38 IST|Sakshi

రోమ్ మాస్టర్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరడం ద్వారా సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఒకే మాస్టర్స్ 1000 ఈవెంట్‌లో 17 సార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2007 నుంచి ఈ టర్నీలో పాల్గొంటున్న జకో.. ఆడిన ప్రతిసారి కనీసం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరి రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ ప్రారంభ రౌండ్లలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జకో.. తాజా ప్రదర్శనతో దిగ్గజ ఆటగాడు రఫెల్‌ నదాల్‌ రికార్డును (16 సార్లు క్వార్టర్స్‌ చేరిన రికార్డు) బద్దలు కొట్టాడు. రోమ్ మాస్టర్స్‌లో ప్రస్తుతం జకోవిచ్‌ గెలుపోటముల రికార్డు 67-10గా ఉంది. 2007 నుంచి జకో ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు ముందు ఓడింది లేదు. 

ఇదిలా ఉంటే, 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన జకోవిచ్‌ ఇటీవల తన సహచర ఆటగాళ్లు రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నదాల్‌లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. తాను ఫెదరర్‌, నదాల్‌లతో ఎప్పుడు స్నేహం చేయలేదని జకో ఓ ఇంటర్వ్యూలో​ చెప్పాడు. ప్రత్యర్థుల మధ్య స్నేహం ఎప్పటికీ కుదరదని చెప్పిన జకో.. తాను ఫెదరర్‌, నదాల్‌లను ఎప్పుడూ గౌరవిస్తానని అన్నాడు. తాను ఫెదరర్, నదాల్‌లను చూస్తూ పెరిగానని, ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే వారి వల్లేనని చెప్పుకొచ్చాడు. కాగా, పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన రికార్డును జకోవిచ్‌.. రఫెల్‌ నదాల్‌ (22)తో పాటు షేర్‌ చేసుకున్నాడు. ఈ ఇద్దరు మోడ్రన్‌ టెన్నిస్‌ దిగ్గజాల తర్వాత రోజర్‌ ఫెదరర్‌ (20) ఉన్నాడు.

చదవండి: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో ప్రణయ్‌

మరిన్ని వార్తలు