Us Open 2021: క్వార్టర్‌ ఫైనల్లోకి వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌

8 Sep, 2021 08:53 IST|Sakshi

క్వార్టర్‌ ఫైనల్లోకి వరల్డ్‌ నంబర్‌వన్‌

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

తొలిసారి క్వార్టర్స్‌ దశకు చేరని అమెరికా క్రీడాకారులు 

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన ఆటగాడిగా శిఖరాన నిలిచేందుకు... క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌తో అరుదైన ఘనతను అందుకునేందుకు వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కేవలం మూడు విజయాల దూరంలో నిలిచాడు. ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో తన సత్తా చాటుతూ జొకో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించడంతో చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యాడు. అమెరికా యువ ఆటగాడు బ్రూక్స్‌బీ కొంత పోటీనిచ్చినా, తన స్థాయిని ప్రదర్శిస్తూ సెర్బియా స్టార్‌ ముందంజ వేయగా... 1880 నుంచి ఈ టోర్నీ చరిత్రలో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో ఒక్క అమెరికన్‌ కూడా క్వార్టర్స్‌ చేరకపోవడం ఇదే తొలిసారి. 
 

న్యూయార్క్‌: వరల్డ్‌ నంబర్‌వన్, 20 గ్రాండ్‌స్లామ్‌ల విజేత జొకోవిచ్‌ (సెర్బియా) యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 1–6, 6–3, 6–2, 6–2తో జెన్సన్‌ బ్రూక్స్‌ బీ (అమెరికా)ను ఓడిం చాడు. 2 గంటల 59 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ ను అనూహ్యంగా బ్రూక్స్‌బీ గెలుచుకున్నా ... ఆ తర్వాత జొకోవిచ్‌ పదునైన ఆట ముందు అతను తలవంచాల్సి వచ్చింది. బ్రూక్స్‌బీ ఓటమితో ఈ టోర్నీలో అమెరికా ఆటగాళ్లందరి పోరాటం ముగిసింది.   
సెమీఫైనల్లో మెద్వెదేవ్‌ 
రష్యా స్టార్‌ ప్లేయర్, రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ వరుసగా మూడో ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్లో రెండో ర్యాంకర్‌ మెద్వెదేవ్‌ 6–3, 6–0, 4–6, 7–5తో ప్రపంచ 117వ ర్యాంకర్‌ బొటిక్‌ జాండ్‌షల్ప్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించాడు.   ఇతర ప్రి క్వార్టర్స్‌ మ్యాచ్‌లలో బెరెటిని 6–4, 3–6, 6–3, 6–2తో ఆస్కార్‌ ఒటే (జర్మనీ)పై, నాలుగో సీడ్‌  జ్వెరెవ్‌ (జర్మనీ) 6–4, 6–4, 7–6 (9/7)తో సిన్నర్‌ (ఇటలీ)పై, లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా) 6–7 (6/8), 6–4, 6–1, 6–3తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు.

చదవండి: టాప్‌ ర్యాంక్‌లోనే షఫాలీ వర్మ 

మరిన్ని వార్తలు