Novak Djokovic: తప్పు ఒప్పుకొన్న జొకోవిచ్‌.. నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష.. కానీ..

13 Jan, 2022 07:57 IST|Sakshi
PC: Novak Djokovic

ఐసోలేషన్‌లో ఉండకపోవడంపై జొకోవిచ్‌ వ్యాఖ్య

Novak Djokovic- Australia Open: కోవిడ్‌–19 సోకిన తర్వాత స్వీయ నిర్బంధంలో గడపకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తాను తప్పు చేశానని సెర్బియన్‌ టెన్నిస్‌ స్టార్‌ జొకోవిచ్‌ అంగీకరించాడు. గత నెలలో తనకు కరోనా సోకిం దని, దాని వల్లే వ్యాక్సినేషన్‌ వేయించుకునే సమయం లభించలేదనే కారణంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక మినహాయింపు పొందాడు.

దీంతో తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేద్దామనుకున్న జొకోవిచ్‌కు కంగారూ గడ్డపై వచ్చీరాగానే అసలు కష్టాలు ఎదురయ్యాయి. మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే అతన్ని నిలిపివేయడంతో పాటు వీసాను రద్దు చేశారు. చివరకు కోర్టు మెట్లెక్కి ఊరట పొందిన సెర్బియన్‌ తను చేసింది పొరపాటేనని అంగీకరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశాడు.  

ఆటా? ఇంటిబాటా? 
జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేది లేనిది నేడు తేలనుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులు, విదేశీ వ్యవహారాలు, బోర్డర్‌ ఫోర్స్‌ వర్గాలు అతను మినహాయింపునకు సమర్పించిన పత్రాలను స్క్రూటినీ చేస్తున్నారు. అతను తప్పుడు ధ్రువ పత్రాలు దాఖలు చేసి ఉంటే అది ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం కఠిన నేరమవుతుంది.

ఈ నేరం కింద ఐదేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. గురువారం టోర్నీ ‘డ్రా’ విడుదల కానుంది. ఇప్పటికే జొకోవిచ్‌కు టాప్‌ సీడింగ్‌ కేటాయించారు. అతడికి గట్టి మందలింపుతో సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.  

చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు 

A post shared by Novak Djokovic (@djokernole)

A post shared by Novak Djokovic (@djokernole)

మరిన్ని వార్తలు