జొకోవిచ్‌కు షాక్‌!

1 Nov, 2020 05:21 IST|Sakshi

ప్రపంచ 42వ ర్యాంకర్‌ చేతిలో ఓటమి

వియన్నా: ప్రపంచ నంబర్‌ వన్, 17 టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)కు ఊహించని ఓటమి ఎదురైంది. ఆస్ట్రియా రాజధానిలో జరుగుతున్న వియన్నా ఓపెన్‌లో అనామక ఆటగాడు లొరెంజో సొనెగొ (ఇటలీ) చేతిలో అతను కంగుతిన్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో జొకోవిచ్‌ 2–6, 1–6తో లొరెంజో చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2005 ఆస్ట్రేలియా ఓపెన్‌ తొలి రౌండ్‌ ఓటమి తర్వాత జొకోవిచ్‌కు ఎదురైన దారుణ పరాభవం ఇదే కావడం విశేషం.

ఈ రెండు మ్యాచ్‌ల్లో జొకోవిచ్‌ కేవలం మూడు గేములను మాత్రమే సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచే తడబడ్డ జొకోవిచ్‌... ఎక్కడా ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారి కూడా సఫలం కాలేదు. ఈ మ్యాచ్‌లో లొరెంజో ఎనిమిది ఏస్‌లను కొట్టగా... జొకోవిచ్‌ కేవలం మూడు ఏస్‌లను మాత్రమే సంధించాడు. క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌లో ఓడి ఈ టోర్నీకి ముందుగా అర్హత సాధించలేకపోయిన 42వ ర్యాంకర్‌ లొరెంజో...అదృష్టం కలిసొచ్చి ‘లక్కీ లూజర్‌’గా అడుగు పెట్టడం విశేషం. గతంలో 12 సార్లు ఇలాంటి లక్కీ లూజర్‌లపై తలపడి ఓటమి ఎరుగని జొకోవిచ్, తొలిసారి పరాజయం పాలయ్యాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా