జొకోవిచ్‌ వస్తున్నాడు...

14 Aug, 2020 02:11 IST|Sakshi

బెల్‌గ్రేడ్‌ (సెర్బియా): ప్రతిష్టాత్మక యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తాను పాల్గొంటానని ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ప్రకటించాడు. గాయం కారణంగా స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌... కరోనా వైరస్‌ నేపథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఈ మెగా టోర్నీకి దూరంగా ఉన్నారు. గత జూన్‌లో కరోనా బారిన పడి కోలుకున్న 32 ఏళ్ల జొకోవిచ్‌ మాత్రం తనకెంతో కలిసొచ్చిన యూఎస్‌ ఓపెన్‌లో పోటీపడతానని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో మూడుసార్లు టైటిల్‌ సొంతం చేసుకున్న ఈ సెర్బియా స్టార్‌ ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ‘అన్ని వైపుల ఉన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా ఆలోచించి యూఎస్‌ ఓపెన్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాను. కరోనా వైరస్‌ నేపథ్యంలో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొన్ని పరిమితుల మధ్య మేము మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని తెలుసు. నా సహాయక సిబ్బందితో కలిసి ప్రణాళికబద్ధంగా యూఎస్‌ ఓపెన్‌కు సిద్ధమయ్యాను’ అని 18 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెల్చుకున్న జొకోవిచ్‌ వ్యాఖ్యానించాడు. 

మరిన్ని వార్తలు