జయహో జొకోవిచ్‌

22 Feb, 2021 05:08 IST|Sakshi

తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ కైవసం

ఫైనల్లో మెద్వెదేవ్‌పై అలవోక విజయం

రూ. 15 కోట్ల 71 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

సెర్బియా స్టార్‌ ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌  

తనకెంతో కలిసొచ్చిన వేదికపై ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మళ్లీ చెలరేగాడు. రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ చాంపియన్‌గా నిలిచాడు. రష్యా యువతార డానిల్‌ మెద్వెదేవ్‌ను ఆద్యంతం హడలెత్తించి... వరుస సెట్‌లలోనే చిత్తు చేసి... ఈ మెగా టోర్నీ ఫైనల్స్‌లో తన అజేయ రికార్డును కొనసాగించాడు. కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన మెద్వెదేవ్‌ తన ప్రత్యర్థి దూకుడుకు ఎదురు నిలువలేక మరోసారి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.   

మెల్‌బోర్న్‌: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 7–5, 6–2, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను ఓడించాడు. తాజా గెలుపుతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును జొకోవిచ్‌ సవరించాడు.  

► 113 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌ కు తొలి సెట్‌లో మినహా ఎక్కడా గట్టిపోటీ ఎదురుకాలేదు. కచ్చితమైన సర్వీస్, బుల్లెట్‌లాంటి రిటర్న్‌ షాట్‌లు,బేస్‌లైన్‌ వద్ద అద్భుత ఆటతీరుతో జొకో విచ్‌ చెలరేగడంతో మెద్వెదేవ్‌కు ఓటమి తప్పలేదు.   

► తాజా విజయంతో 33 ఏళ్ల జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో తన విజయాల రికార్డును 9–0తో మెరుగుపర్చుకున్నాడు. గతంలో జొకోవిచ్‌ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు చాంపియన్‌గా నిలిచాడు.  

► విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 27 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 కోట్ల 71 లక్షలు), 2000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌గా నిలిచిన మెద్వెదేవ్‌కు 15 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 57 లక్షలు), 1200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

► ఫైనల్‌ చేరే క్రమంలో కేవలం రెండు సెట్‌లు మాత్రమే కోల్పోయిన మెద్వెదేవ్‌ ఆటలు తుది పోరులో మాత్రం సాగలేదు. తొలి సెట్‌ రెండో గేమ్‌లోనే మెద్వెదేవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆలస్యంగా తేరుకున్న మెద్వెదేవ్‌ ఐదో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 3–3తో సమం చేశాడు. అయితే 6–5తో ఆధిక్యంలోకి వెళ్లిన జొకోవిచ్‌ 12వ గేమ్‌లో మెద్వెదేవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు.  

► రెండో సెట్‌ బ్రేక్‌ పాయింట్లతో మొదలైంది. ఇద్దరూ తమ సర్వీస్‌లను చేజార్చుకోవడంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. ఆ తర్వాత జొకోవిచ్‌ జోరు పెంచడంతో మెద్వెదేవ్‌ డీలా పడ్డాడు. రెండుసార్లు మెద్వెదేవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఈ సెర్బియా స్టార్‌ సెట్‌ను కైవసం చేసుకున్నాడు.  

► మూడో సెట్‌ ఆరంభంలోనే జొకోవిచ్‌ బ్రేక్‌ పాయింట్‌ సాధించి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మెద్వెదేవ్‌ తేరుకునేందుకు ప్రయత్నించినా జొకోవిచ్‌ దూకుడు ముందు సాధ్యంకాలేదు.   

► తాజా టైటిల్‌తో జొకోవిచ్‌ మార్చి 8వ తేదీ వరకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాడగం ఖాయమైంది. తద్వారా అత్యధిక వారాలపాటు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా (311 వారాలు) జొకోవిచ్‌ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఫెడరర్‌ (310 వారాలు) పేరిట ఉంది.  

► 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో జొకోవిచ్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్‌ (20 చొప్పున)కు చేరువయ్యాడు. జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒకసారి... వింబుల్డన్‌లో ఐదుసార్లు... యూఎస్‌ ఓపెన్‌లో మూడుసార్లు విజేతగా నిలిచాడు.  

కొత్త తరం ఆటగాళ్లు తెరపైకి వచ్చారని, తమ ఆటతో మా ముగ్గురిని (ఫెడరర్, నాదల్, జొకోవిచ్‌) వెనక్కి నెట్టేస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నాకు మాత్రం అలా అనిపించడంలేదు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లంటే గౌరవం ఉంది. కానీ వారు ‘గ్రాండ్‌’ విజయాలు సాధించాలంటే మాత్రం చాలా కష్టపడాలి. రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండటం... టోర్నీ మధ్యలో గాయపడటం... మొత్తానికి నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆడిన గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఇది. ఈ టోర్నీతో నేను కొత్త పాఠాలు నేర్చుకున్నాను.
 – జొకోవిచ్‌


విన్నర్స్, రన్నరప్‌ ట్రోఫీలతో జొకోవిచ్, మెద్వెదేవ్‌

మరిన్ని వార్తలు