Colin De Grandhome: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్‌ ఆల్‌రౌండర్‌ గుడ్‌బై

31 Aug, 2022 10:28 IST|Sakshi
Photo Credit: ICC

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. జింబాబ్వేలో పుట్టి పెరిగిన 36 ఏళ్ల గ్రాండ్‌హోమ్‌ 2004 వరకు జింబాబ్వే తరపున క్రికెట్‌ ఆడాడు. 2004లో బంగ్లాదేశ్‌ వేదికగా జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లోనూ గ్రాండ్‌హోమ్‌ జింబాబ్వే తరపునే పాల్గొన్నాడు. ఆ తర్వాత 2006లో కుటుంబంతో కలిసి ఆక్లాండ్‌కు వలస వచ్చిన గ్రాండ్‌హోమ్‌ 2012లో న్యూజిలాండ్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

దాదాపు దశాబ్దం పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్రాండ్‌హోమ్‌ మంచి ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించాడు. 29 టెస్టుల్లో 1432 పరుగులు.. 49 వికెట్లు, 45 వన్డేల్లో 742 పరుగులు.. 30 వికెట్లు, 41 టి20ల్లో 505 పరుగులు.. 12 వికెట్లు తీశాడు. గ్రాండ్‌హోమ్‌ ఖాతాలో టెస్టుల్లో రెండు సెంచరీలు, 8 అర్థసెంచరీలు ఉండగా.. వన్డేల్లో 4 హాఫ్‌ సెంచరీలు అందుకున్నాడు. కాగా తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టులో కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ సభ్యుడు. ఇక 2019లో వన్డే ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచిన కివీస్‌ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.

ఇక తన రిటైర్మెంట్‌పై గ్రాండ్‌హోమ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ''రిటైర్మెంట్‌ నిర్ణయం బాధిస్తున్నప్పటికి తప్పడం లేదు. గాయాల కారణంగా సరైన క్రికెట్‌ ఆడలేకపోతున్నానే ఫీలింగ్‌ కలుగుతుంది. ఫామ్‌లో లేను.. ఇలాంటి సమయంలో నేను రిటైర్‌ అయితే కనీసం కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. 2012లో కివీస్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బ్లాక్‌క్యాప్స్‌కు ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. ఇన్నేళ్ల అంతర్జాతీయ కెరీర్‌ సాఫీగా సాగినందుకు గర్వపడుతున్నా. నా ఆట ముగింపుకు ఇదే సరైన సమయమని.. అందుకే ఈ నిర్ణయం'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లోనూ 2017 నుంచి 2019 మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌కు ఆడిన గ్రాండ్‌హోమ్‌ 25 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేశాడు.

చదవండి: AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్‌

Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్‌

మరిన్ని వార్తలు