IND Vs NZ: తొలి ప్లేయర్‌గా కోహ్లి.. అశ్విన్‌ పేరిట నాలుగు

7 Dec, 2021 08:01 IST|Sakshi

IND Vs NZ 2nd Test Records Shattered.. సొంతగడ్డపై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారత క్రికెట్‌ జట్టు వరుసగా 14వ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ జట్టుతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 372 పరుగుల తేడాతో బ్రహ్మాండమైన విజయం సాధించింది. 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ పరంగా పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

చదవండి:ICC Test Rankings- India No.1: కివీస్‌పై ప్రతీకారం.. అదరగొట్టిన కోహ్లి సేన..నెంబర్‌ 1!

స్వదేశంలో భారత్‌కిది వరుసగా 14వ టెస్టు సిరీస్‌ విజయం. 2013 నుంచి భారత జట్టు సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోలేదు. 

పరుగులపరంగా(372) భారత్‌కు టెస్టుల్లో ఇదే అతిపెద్ద విజయం. 2015 ఢిల్లీలో దక్షిణాఫ్రికాపై భారత్‌ 337 పరుగుల తేడాతో నెగ్గిన రికార్డు తెరమరుగైంది.

స్వదేశంలో టెస్టుల్లో అశ్విన్‌ తీసిన వికెట్ల సంఖ్య 300. అనిల్‌ కుంబ్లే (350 వికెట్లు) తర్వాత స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.

క్యాలెండర్‌ ఇయర్‌లో టెస్టుల్లో 50 కంటే ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్‌కిది నాలుగోసారి. ఈ ఏడాది అశ్విన్‌ 52 వికెట్లు పడగొట్టాడు. 2015, 2016, 2017లలో కూడా అశ్విన్‌ 50కిపైగా వికెట్లు తీశాడు. గతంలో షేన్‌ వార్న్‌ (8 సార్లు), మురళీధరన్‌ (6 సార్లు), మెక్‌గ్రాత్‌ (5 సార్లు) మాత్రమే ఇలాంటి ఘనత సాధించారు.

టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్‌లలో 50 చొప్పున విజయాలు అందుకున్న తొలి ప్లేయర్‌గా విరాట్‌ కోహ్లి గుర్తింపు పొందాడు.

టెస్టుల్లో అశ్విన్‌ గెల్చుకున్న ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డుల సంఖ్య 9 . కలిస్‌ (దక్షిణాఫ్రికా–9)తో అశ్విన్‌ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. మురళీధరన్‌ (శ్రీలంక –11 సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.

భారత్, కివీస్‌ టెస్టు సిరీస్‌ల చరిత్రలో అశ్విన్‌ తీసిన వికెట్లు 66 . హ్యాడ్లీ (65 వికెట్లు)ని వెనక్కి నెట్టి అశ్విన్‌ టాప్‌లోకి వచ్చాడు. 

పరుగులపరంగా (372) న్యూజిలాండ్‌కు టెస్టుల్లో ఇదే పెద్ద ఓటమి. ఇంతకుముందు కివీస్‌ 2007 లో దక్షిణాఫ్రికా చేతిలో 358 పరుగుల తేడాతో ఓడింది.

మరిన్ని వార్తలు