సాఫ్ట్‌ సిగ్నల్‌.. మరోసారి రాజుకున్న వివాదం!

23 Mar, 2021 17:42 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: టీమిండియా- ఇంగ్లండ్‌ నాలుగో టీ20లో భారత ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అవుటైన తీరు నేపథ్యంలో సాఫ్ట్‌సిగ్నల్‌, అంపైర్స్‌ కాల్‌ నిబంధనలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా, న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి తెరతీసింది. మూడు వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల నిమిత్తం బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా రెండో వన్డే జరిగింది. టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

ఈ క్రమంలో, 14.5వ ఓవర్‌లో భాగంగా కివీస్‌ ఆటగాడు కైల్‌ జెమీషన్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న, బంగ్లా కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అతడికి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. 6 ఫీట్ల 8 అంగుళాల పొడవున్న ఉన్న జెమీషన్‌ ఏమాత్రం ఇబ్బంది​కి లోనుకాకుండా, నేలమీదకు వంగి మరీ బంతిని ఒడిసిపట్టాడు. ఈ క్రమంలో తనను తాను తమాయించుకోలేక, కింద పడిపోయాడు. అయితే, అంపైర్‌ ఔట్‌ అంటూ సాఫ్ట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ విషయంపై స్పందించిన టీవీ అంపైర్‌.. ‘‘బంతి నేలమీద పడినట్లు నాకు కనిపిస్తోంది.

అంతేకాదు, ఆటగాడు కూడా పూర్తిగా కంట్రోల్‌లో లేడు’’అని చెబుతూ, సాఫ్ట్‌ సిగ్నల్‌ నిర్ణయాన్ని తారుమారు చేస్తూ, నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో జెమీషన్‌తో పాటు, కివీస్‌ ఆటగాళ్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక ఈ విషయంపై స్పందించిన న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌.. ఇలాంటి నిర్ణయాన్ని నేనింత వరకు చూడలేదు. క్రేజీ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్‌ టీ20 మ్యాచ్‌లో సాఫ్ట్‌ సిగ్నల్‌ ఫలితం బౌలర్‌కు అనుకూలంగా రాగా, ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

చదవండి: ధవన్‌ ఖాతాలో అరుదైన రికార్డు..
వన్డే సిరీస్‌: టీమిండియా ముందున్న రికార్డులు ఇవే!
అదొక చెత్త నిర్ణయం: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు