ENG Vs NZ 1st Test: చారిత్రక లార్డ్స్‌ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది'

31 May, 2022 19:18 IST|Sakshi

ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్‌లో లార్డ్స్‌ స్టేడియానికి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. ఇంగ్లండ్‌లో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు, మేజర్‌ టోర్నీలు జరిగినా ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం లార్డ్స్‌ స్టేడియంలోనే నిర్వహించడం ఆనవాయితీ. లార్డ్స్‌ బాల్కనీ నుంచి కప్‌ను అందుకోవడం ప్రతీ జట్టు కెప్టెన్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. లార్డ్స్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతుందంటే పూర్తి సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. అది టెస్టు.. వన్డే.. టి20 ఏదైనా సరే వంద శాతం ప్రేక్షకులు ఉంటారు.

అలాంటి పేరున్న లార్డ్స్‌ స్టేడియానికి మొదటిసారి అవమానం జరిగింది.  జూన్‌ 2న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే తొలిసారి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న తొలి టెస్టుకు మాత్రం చాలా టికెట్స్‌ మిగిలిపోయాయి. దీనికి కారణం ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) టికెట్స్‌ ధరలు పెంచడమేనంట. టెలిగ్రాఫ్‌ కథనం ప్రకారం.. లార్డ్స్‌ టెస్టు తొలి నాలుగు రోజులకు 20వేల టికెట్లు మిగిలిపోయినట్లు సమాచారం. బార్మీ ఆర్మీ పేర్కొన్న ప్రకారం ఒక టికెట్‌పై 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల దాకా పెంచడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ టికెట్స్‌ కొనుగోలు చేయడంపై వెనక్కి తగ్గారు. ఒక టెస్టు మ్యాచ్‌కు అంత టికెట్‌ ధర ఉంటే ఎలా కొంటామని.. దీనికంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్‌ చూడడం బెటర్‌ అని చాలామంది ఫ్యాన్స్‌ వాపోయారు.

సోమవారం సాయంత్రం ​వరకు అందిన రిపోర్ట్స్‌ ప్రకారం.. తొలి రోజున 1800 టికెట్లు, రెండో రోజుకు 2500 టికెట్లు, మూడోరోజుకు 4600 టికెట్లు, నాలుగో రోజుకు 9600 టికెట్లు మిగిలే ఉన్నాయని తేలింది. ఇక జో రూట్‌ కెప్టెన్‌ పదవి నుంచి తప్పుకున్నాకా.. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం.. కొత్త కోచ్‌ రావడంతో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌కు ఫుల్‌క్రేజ్‌ వచ్చింది.


కాగా లార్డ్స్‌ స్టేడియంలో టికెట్ల రేట్లు పెంపుపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ ఈసీబీని ట్విటర్‌ వేదికగా ఎండగట్టాడు. ''చారిత్రాక లార్డ్స్‌ మైదానానికి ఇది పెద్ద అవమానం. లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్‌ జరుగుతుందంటే తొలిరోజు పూర్తిస్థాయిలో స్టేడియం నిండుతుంది. కానీ తొలిసారి స్టేడియం ఫుల్‌ కావడం లేదు. ఇది భరించలేకుండా ఉంది. ఒక్కసారిగా టికెట్స్‌ ధరలు అంత పెంచడంపై ఈసీబీ మర్మమేంటో అర్థం కావడం లేదు. ఒక్క టికెట్‌పై 100 నుంచి 160 పౌండ్లు పెంచడమేంటి.. అంత ధర ఎందుకు? ప్రస్తుతం సమ్మర్‌ సీజన్‌ కావడంతో పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి. వారి పేరెంట్స్‌తో కలిసి మ్యాచ్‌ చూడాలని స్టేడియాలకు వస్తుంటారు. కాబట్టి అమ్ముడపోని టికెట్స్‌ను పిల్లల కోసం ప్రత్యేకంగా టికెట్‌ ధరను 40 పౌండ్లుగా నిర్ణయించి స్టేడియంను ఫుల్‌ చేస్తే బాగుంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్‌..!

T20 Blast 2022: భారీ సిక్సర్‌.. బర్గర్‌ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి

మరిన్ని వార్తలు