NZ VS ENG 2nd Test Day 3: పట్టుబిగించిన ఇంగ్లండ్‌.. భారమంతా కేన్‌ మామపైనే..!

26 Feb, 2023 13:15 IST|Sakshi

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ పట్టుబిగించింది. ఫాలో ఆన్‌ ఆడుతున్న న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (83), డెవాన్‌ కాన్వే (61) అర్ధసెంచరీలు చేసి ఔట్‌ కాగా.. కేన్‌ విలియమ్సన్‌ (25 నాటౌట్‌), హెన్రీ నికోల్స్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు. జాక్‌ లీచ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. జో రూట్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 24 పరుగులు వెనుకపడి ఉంది. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత పూర్తిగా కేన్‌ విలియమ్స్‌న్‌పై ఉంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌ (176 బంతుల్లో 186; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో శివాలెత్తగా.. రూట్‌ (153 నాటౌట్‌) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మ్యాట్‌ హెన్రీ 4 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్‌ 2, సౌథీ, వాగ్నర్‌ తలో వికెట్‌ దక్కించకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్‌ ఆడుతుంది. కెప్టెన్‌ సౌథీ (49 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇ​న్నింగ్స్‌ ఆడకపోతే న్యూజిలాండ్‌ ఈ మాత్రం కూడా స్కోర్‌ చేయలేకపోయేది. ఇంగ్లండ్‌ వెటరన్‌ పేస్‌ సింహాలు ఆండర్సన్‌ (3/37), స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/61) మరోసారి చెలరేగగా. జాక్‌ లీచ్‌ (3/80) పర్వాలేదనిపించాడు. ఫాలో ఆన్‌ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి 24 పరుగులు వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.    
 

మరిన్ని వార్తలు