NZ Vs Eng: జాక్‌ లీచ్‌ మాయాజాలం.. దెబ్బకు బౌల్డ్‌.. బిత్తరపోయిన బ్యాటర్‌! వీడియో వైరల్‌

26 Feb, 2023 14:11 IST|Sakshi
విల్‌ యంగ్‌ను బౌల్డ్‌ చేసిన జాక్‌ లీచ్‌ (PC: BT Sport Twitter)

NZ Vs Eng 2nd Test Day 3: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫాలో ఆన్‌ ఆడుతున్న కివీస్‌కు శుభారంభం అందించిన డెవాన్‌ కాన్వేను పెవిలియన్‌(52.5 ఓవర్‌)కు పంపి తొలి వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 61 పరుగులతో రాణించిన కాన్వేను బోల్తా కొట్టించి ఓపెనింగ్‌ జోడీని విడగొట్టాడు. 

జాక్‌ లీచ్‌ బాటలో జో రూట్‌ కూడా.. ప్రమాదకరంగా మారుతున్న టామ్‌ లాథమ్‌(83)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. వీళ్లిద్దరూ కలిసి.. మెరుగ్గా ఆడుతున్న ఓపెనర్లను అవుట్‌ చేయడంతో కివీస్‌ కష్టాల్లో కూరుకుపోయింది. ఇదిలా ఉంటే... విల్‌ యంగ్‌ రూపంలో జాక్‌ లీచ్‌కు రెండో వికెట్‌ దక్కింది.

అయితే, అతడిని లీచ్‌ అవుట్‌ చేసిన తీరు ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. అరవై రెండో ఓవర్‌ నాలుగో బంతికి లీచ్‌ స్పిన్‌ మాయాజాలం ప్రదర్శించాడు.  ఈ క్రమంలో ఆఫ్‌ స్టంప్‌ దిశగా వచ్చిన బంతిని అంచనా వేయలేకపోయాడు విల్‌ యంగ్‌. ముందుకు రావాలో లేదంటే క్రీజులోనే నిలబడాలో తెలియని సంకట స్థితిలో పడ్డాడు.

డిఫెన్స్‌ చేద్దామని ప్రయత్నించేలోపే బంతి ఆఫ్‌ స్టంప్‌ను ఎగురగొట్టడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బౌల్డ్‌ అయిన విల్‌ యంగ్‌ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిరాశగా నిష్క్రమించాడు. జాక్‌ లీచ్‌ అద్భుత డెలివరీకి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. వెల్లింగ్‌టన్‌ టెస్టులో ఫాలో ఆన్‌ ఆడుతున్న న్యూజిలాండ్‌ మూడో రోజు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. పర్యాటక ఇంగ్లండ్‌ కంటే ఇంకా 24 పరుగుల వెనుకబడి ఉంది. కేన్‌ విలియమ్సన్‌(25), హెన్రీ నికోల్స్‌(18) క్రీజులో ఉన్నారు.

మరోవైపు.. బజ్‌బాల్‌ విధానంతో దూకుడు ప్రదర్శిస్తున్న స్టోక్స్‌ బృందం 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తిలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఇక కివీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది.

చదవండి: BGT: దానర్థం జట్టు నుంచి తప్పించినట్లు కాదు! రాహుల్‌కు మరిన్ని అవకాశాలు! వైస్‌ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. కాకపోతే..
Vijender Singh: ఉద్యోగం కోసమే మొదలెట్టాడు.. విధిరాత మరోలా ఉంది! ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకని వారించినా!

>
మరిన్ని వార్తలు