Kane Williamson: పార్ట్‌టైమ్‌ పేసర్‌ చేతికి చిక్కి.. తొలి బాధితుడిగా.. పాపం కేన్‌ మామ! వీడియో వైరల్‌

27 Feb, 2023 12:51 IST|Sakshi
పార్ట్‌టైమ్‌ పేసర్‌ చేతికి చిక్కి.. తొలి బాధితుడిగా కేన్‌ మామ(PC: BT Sport Twitter)

New Zealand vs England, 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ బౌలింగ్‌ స్కిల్‌తోనూ ఆకట్టుకున్నాడు. పర్యాటక జట్టు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌ను అవుట్‌ చేసి బ్రేక్‌ అందించాడు. న్యూజిలాండ్‌ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న కేన్‌ మామ జోరుకు ఈ పార్ట్‌టైమ్‌ పేసర్‌ అడ్డుకట్ట వేశాడు.

జాక్‌ లీచ్‌, ఆండర్సన్‌, బ్రాడ్‌ల బౌలింగ్‌ను చెండాడిన విలియమ్సన్‌ వికెట్‌ను హ్యారీ బ్రూక్‌ తన ఖాతాలో వేసుకోవడం నాలుగో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. ఇక హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి టెస్టు వికెట్‌ కావడం మరో విశేషం. 

పార్ట్‌టైమ్‌ పేసర్‌ చేతికి చిక్కి.. తొలి బాధితుడిగా
ఫాలో ఆన్‌ ఆడుతున్న కివీస్‌కు తన అద్భుత బ్యాటింగ్‌తో ఊపిరిలూదాడు విలియమ్సన్‌. క్రీజులో పట్టుదలగా నిలబడి 282 బంతులు ఎదుర్కొని 12 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసిన కేన్‌ మామ.. 152వ ఓవర్లో హ్యారీ బ్రూక్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాల్సి వచ్చింది.

పార్ట్‌టైమ్‌ పేసర్‌ బ్రూక్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టిన వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ వెంటనే బంతిని వికెట్లకు గిరాటేశాడు. అయితే, బ్యాట్‌కు బంతి తాకిందా లేదా అన్న సందిగ్దం నెలకొన్న వేళ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రివ్యూకు వెళ్లి సఫలమయ్యాడు. దీంతో విలియమ్సన్‌ నిరాశగా వెనుదిరిగాడు. దీంతో.. హ్యారీ బ్రూక్‌కు టెస్టుల్లో వికెట్‌ సమర్పించుకున్న తొలి బాధిత బ్యాటర్‌గా విలియమ్సన్‌ నిలిచాడు. 

ప్రత్యర్థికి కివీస్‌ సవాల్‌
ఫాలో ఆన్‌ ఆడిన కివీస్‌ 483 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. 258 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో సోమవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ 11 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది. ఇక తొలి టెస్టులో గెలుపొందిన ఇంగ్లండ్‌.. ఈ టెస్టులోనూ గెలవాలంటే విజయానికి 210 పరుగులు అవసరం.

బ్రూక్‌, రూట్‌ వల్లే
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయడంలో హ్యారీ బ్రూక్‌ కీలక పాత్ర పోషించాడు. జో రూట్‌ అజేయ సెంచరీ(153)కి తోడుగా 186 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరి విజృంభణ నేపథ్యంలో ఇంగ్లండ్‌ 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా.. కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌.. కేవలం 2 బంతుల్లోనే ఖేల్‌ ఖతం, అత్యంత చెత్త రికార్డులు
NZ VS ENG 2nd Test: కేన్‌ విలియమ్సన్‌ ఖాతాలో భారీ రికార్డు.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ చరిత్రలోనే..!

మరిన్ని వార్తలు