డారిల్‌ మిచెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. కివీస్‌ చేతిలో పాక్‌ చిత్తు! బాబర్‌ పోరాడినా..

12 Jan, 2024 15:39 IST|Sakshi

న్యూజిలాండ్‌ పర్యటనను పాకిస్తాన్‌ పరాజయంతో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. అక్లాండ్‌ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఓపెనర్‌ డెవాన్‌ కాన్వేను డకౌట్‌ చేసి శుభారంభం అందుకుంది. అయితే, మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌(35), వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ విలియమ్సన్‌(57) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు.

ఇక నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన డారిల్‌ మిచెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కొరకరాని కొయ్యలా మారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులు  సాధించాడు. మిగిలిన వాళ్లలో మార్క్‌ చాప్‌మప్‌ 26(11 బంతుల్లో) రన్స్‌తో రాణించాడు.

బ్యాటర్లంతా రాణించడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజం ఒక్క హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొత్తంగా 35 బంతులు ఎదుర్కొని 57 పరుగులు సాధించాడు.

మిగతా వాళ్లలో ఓపెనర్లు సయీమ్‌ ఆయుబ్‌(27), మహ్మద్‌ రిజ్వాన్‌(25), ఇఫ్తికర్‌ అహ్మద్‌(24) మాత్రమే 20 అంకెల స్కోరు చేశారు. రిజ్వాన్‌, ఇఫ్తికర్‌ రూపంలో కీలక వికెట్లు తీసిన టిమ్‌ సౌతీ.. అబ్బాస్‌ ఆఫ్రిది(1), హారిస్‌ రవూఫ్‌(0)లను త్వరత్వరగా పెవిలియన్‌కు పంపాడు.

మొత్తంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుని పాక్‌ను కోలుకోని దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఆడం మిల్నే రెండు, బెన్‌ సియర్స్‌ రెండు, ఇష్‌ సోధి ఒక వికెట్‌ దక్కించుకున్నారు. కివీస్‌ బౌలర్ల విజృంభణతో 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్‌ అయిన పాకిస్తాన్‌ 46 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఇక పాకిస్తాన్‌ కెప్టెన్‌గా ఆ జట్టు ప్రధాన పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది ఇదే తొలి మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో అతడు బౌలర్‌గా, సారథిగానూ విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ఆఫ్రిది.. కెప్టెన్‌గా అరంగేట్ర మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాడు. మరోవైపు.. కివీస్‌ను గెలిపించిన డారిల్‌ మిచెల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది’ మ్యాచ్‌ అవార్డు దక్కింది.

>
మరిన్ని వార్తలు