సౌతాఫ్రికా క్రికెట్‌కు ఘోర అవమానం.. 92 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

17 Feb, 2024 11:05 IST|Sakshi
విజేతగా న్యూజిలాండ్‌ (PC: Blackcaps X)

South Africa tour of New Zealand, 2024- హామిల్టన్‌: ఎట్టకేలకు టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై న్యూజిలాండ్‌ జట్టు తొలిసారి సిరీస్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ఛేదించి సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 1932 నుంచి రెండు జట్ల మధ్య 18 టెస్టు సిరీస్‌లు జరిగాయి.

దక్షిణాఫ్రికా 13 సార్లు నెగ్గగా, నాలుగు సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 18వ ప్రయత్నంలో మొదటిసారి న్యూజిలాండ్‌కు సిరీస్‌ దక్కింది. ఓవర్‌నైట్‌ స్కోరు 40/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ 94.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి గెలిచింది.

కేన్‌ విలియమ్సన్‌ (133 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. విల్‌ యంగ్‌ (60 నాటౌట్‌; 8 ఫోర్లు)తో కలిసి విలియమ్సన్‌ నాలుగో వికెట్‌కు 152 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యాన్ని జోడించాడు. 

కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో సీనియర్‌ ఆటగాళ్లంతా బిజీగా ఉండటంతో.. అనుభవలేమి, యువ ప్లేయర్లతో కూడిన జట్టును కివీస్‌ పర్యటనకు పంపింది ప్రొటిస్‌ బోర్డు. తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఐదుగురు సౌతాఫ్రికా క్రికెటర్లు అరంగేట్రం చేయడం విశేషం. ఫలితంగా.. న్యూజిలాండ్‌తో పోటీలో.. 92 ఏళ్ల చరిత్రలో తొలిసారి టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై.. భారీ మూల్యమే చెల్లించింది. న్యూజిలాండ్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు