NZ VS SL 1st Test Day 1: జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన ఏంజెలో మాథ్యూస్‌ 

9 Mar, 2023 12:40 IST|Sakshi

శ్రీలంక వెటరన్‌ ప్లేయర్‌ ఏంజెలో మాథ్యూస్‌ ఆ దేశ క్రికెట్‌కు సంబంధించి ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 47 పరుగులు చేసిన మాథ్యూస్‌.. శ్రీలంక తరఫున టెస్ట్‌ల్లో 7000 పరుగుల మార్కును అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఈ క్రమంలో అతను ఆ దేశ దిగ్గజం సనత్‌ జయసూర్య రికార్డును అధిగమించాడు. జయసూర్య 110 టెస్ట్‌ల్లో 6973 పరుగులు చేస్తే.. మాథ్యూస్‌ 101 టెస్ట్‌ల్లోనే 7000 పరుగుల మార్కును అందుకున్నాడు. లంక తరఫున అత్యధిక టెస్ట్‌ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కర (134 టెస్ట్‌ల్లో 12400 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. మహేళ జయవర్ధనే (149 టెస్ట్‌ల్లో 11814 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు.

లంక తరఫున టెస్ట్‌ల్లో 6000 అంతకంటే ఎక్కువ పరుగులు (ప్రస్తుతం​ ఆడుతున్న ఆటగాళ్లలో) చేసిన ఆటగాళ్లలో మాథ్యూస్‌ తర్వాత దిముత్‌ కరుణరత్నే (83 టెస్ట్‌ల్లో 6073) మాత్రమే ఉన్నాడు. 

ఇదిలా ఉంటే,  క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో తొలుత బ్యాటంగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (50), కుశాల్‌ మెండిస్‌ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్‌ (47), దినేశ్‌ చండీమాల్‌ (39) పర్వాలేదనిపించారు.

ఓపెనర్‌ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్‌ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్‌ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్‌ హెన్రీ 2, బ్రేస్‌వెల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన ఉండటంతో శ్రీలంక ఈ మ్యాచ్‌ను డూ ఆర్‌ డై అన్నట్లుగా తీసుకుంది. ఫైనల్‌ బెర్తల్లో ఓ బెర్త్‌ ఆస్ట్రేలియా ఇదివరకే ఖరారు చేసుకోగా మరో బెర్త్‌ కోసం భారత్‌, శ్రీలంక జట్ల మధ్య ఒకింత లేని పోటీ నెలకొంది.

భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి.. మరోపక్క కివీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టి ద్వీప దేశం ఫైనల్‌కు చేరుకుంటుంది. 
 

మరిన్ని వార్తలు