Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్‌ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్‌ మామ

13 Mar, 2023 14:27 IST|Sakshi
నరాలు తెగే ఉత్కంఠ.. కివీస్‌ గెలుపు (PC: Blackcaps)

New Zealand vs Sri Lanka, 1st Test- Kane Williamson: మార్చి 13, 2023.. క్రైస్ట్‌చర్చ్‌.. హాగ్లే ఓవల్‌ మైదానం.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న శ్రీలంక.. సొంతగడ్డపై ప్రత్యర్థికి అవకాశమివ్వకూడదన్న పంతంతో న్యూజిలాండ్‌.. గెలవాలంటే ఐదు బంతుల్లో 7 పరుగులు కావాలి.. 

70వ ఓవర్‌.. క్రీజులో కేన్‌ విలియమ్సన్‌, మ్యాట్‌ హెన్రీ.. చేతిలో మూడు వికెట్లు..  అంతలోనే సమన్వయలోపం కారణంగా రనౌట్‌.. బౌలర్‌ అషిత ఫెర్నాండో చురుగ్గా కదిలి డైవ్‌ చేసి మరీ బంతిని వికెట్లకు గిరాటేయడంతో హెన్రీ అవుట్‌..

క్రీజులోకి నీల్‌ వాగ్నర్‌.. చేతిలో రెండు వికెట్లు.. గెలవాలంటే ఆరు పరుగులు కావాలి.. ఇక విలియమ్సన్‌ ఆలస్యం చేయలేదు.. ఫెర్నాండో బౌలింగ్‌లో అద్భుత బౌండరీతో నాలుగు పరుగులు రాబట్టాడు.. 

నరాలు తెగే ఉత్కంఠ
న్యూజిలాండ్‌ గెలుపు సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగు.. వెంటనే డాట్‌బాల్‌.. ఇరు జట్ల స్కోర్లు సమం.. గెలవాలంటే మిగిలిన ఒక్క బంతికి ఒక్క పరుగు కావాలి.. శ్రీలంకతో పాటు టీమిండియా అభిమానుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ.. బైస్‌.. షాట్‌ ఆడేందుకు కేన్‌ విలియమ్సన్‌ ప్రయత్నం.. వాగ్నర్‌కు కాల్‌.. సింగిల్‌ తీసేందుకు క్రీజు వీడిన కేన్‌ మామ..

లంక ఆశలపై నీళ్లు.. కేన్‌ మామపై ప్రశంసల జల్లు
ఆలోపే బంతిని అందుకున్న వికెట్‌ కీపర్‌ డిక్‌విల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫెర్నాండో వైపు విసరగా.. బాల్‌ అందుకున్న ఫెర్నాండో వెంటనే వికెట్లకు గిరాటేశాడు.. మరి కేన్‌ మామ అప్పటికే పరుగు పూర్తి చేశాడా లేదోనన్న సందేహం! కివీస్‌కు అనుకూలంగా థర్డ్‌ ఎంపైర్‌ నుంచి స్పందన.. లంక ఆశలపై నీళ్లు.. ఆఖరి బంతికి కివీస్‌ను గెలిపించిన కేన్‌ విలియమ్సన్‌పై ప్రశంసల జల్లు.. 

అప్పుడు ఇంగ్లండ్‌
లంక ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా.. ఇలా నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌తో ఓ అరుదైన రికార్డు నమోదైంది. టెస్టు మ్యాచ్‌లో ఆఖరి బంతి(బైస్‌ రూపంలో)కి విజయం అందుకున్న రెండో జట్టుగా న్యూజిలాండ్‌ నిలిచింది. అంతకుముందు 1948లో డర్బన్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ (లెగ్‌బైస్‌) రూపంలో పరుగు సాధించి విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలో దాదాపు 75 ఏళ్ల తర్వాత కివీస్‌ ఈ అత్యంత అరుదైన ఫీట్‌ నమోదు చేసింది. నాడు క్లిఫ్‌ గ్లాడ్విన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఇంగ్లండ్‌ గెలుపు అందుకోగా.. తాజా మ్యాచ్‌లో విలియమ్సన్‌ కారణంగా కివీస్‌కు విజయం లభించింది.​

చదవండి: WTC Final- Ind Vs Aus: అప్పుడు అడ్డుకున్న న్యూజిలాండ్‌.. ఈసారి ఇలా! టీమిండియాకు..
Ind vs Aus- Ahmedabad Test: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా మరెన్నో..

మరిన్ని వార్తలు