NZ Vs SL 2nd T20: మిల్నే థండర్‌బోల్ట్‌.. దెబ్బకు నిసాంక బ్యాట్‌ విరిగిపోయింది! వీడియో వైరల్‌

5 Apr, 2023 14:32 IST|Sakshi
మిల్నే దెబ్బకు విరిగిన బ్యాట్‌ (PC: Spark Sport Twitter)

శ్రీలంకతో రెండో టీ20లో న్యూజిలాండ్‌ పేసర్‌ ఆడం మిల్నే దుమ్ము రేపాడు. ఐదు వికెట్లతో చెలరేగి లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల బ్యాటింగ్‌ కోటా పూర్తి చేసిన మిల్నే.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్లు కూల్చాడు.

ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక(9)ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి కివీస్‌కు శుభారంభం అందించిన మిల్నే.. కుశాల్‌ పెరెరా(35), చరిత్‌ అసలంక(24) సహా ఆఖర్లో ప్రమోద్‌ మదుషాన్‌(1), దిల్షాన్‌ మదుషంక(0)లను పెవిలియన్‌కు పంపాడు.

మిల్నే విజృంభణ.. దంచి కొట్టిన సీఫర్ట్‌
 మిల్నే విజృంభణతో డునెడిన్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య కివీస్‌ .. లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసి టార్గెట్‌ను ఛేదించింది. దసున్‌ షనక విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్‌ కోల్పోయి 14.4 ఓవర్లలోనే ఛేజ్‌ చేసింది. టిమ్‌ సీఫర్ట్‌ 43 బంతుల్లో 79 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. తద్వారా 9 వికెట్లతో గెలుపొంది.. తొలి టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

దెబ్బకు బ్యాట్‌ విరిగిపోయింది
ఇదిలా ఉంటే.. తన అద్భుత బౌలింగ్‌తో లంక బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఆడం మిల్నే.. సూపర్‌ డెలివరీతో పాతుమ్‌ నిసాంక బ్యాట్‌ను విరగ్గొట్టిన తీరు ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆరంభంలోనే ఈ మేరకు తన పేస్‌ పదును చూపించాడు మిల్నే.

తొలి ఓవర్లోనే మిల్నే దెబ్బకు పాతుమ్‌ నిసాంక బ్యాట్‌ హ్యాండిల్‌ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా న్యూజిలాండ్‌- శ్రీలంక రెండో టీ20లో మిల్నే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య ఏప్రిల్‌ 8న నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది.

చదవండి: వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు
IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు

మరిన్ని వార్తలు