NZ VS SL 2nd Test: డబుల్‌ సెంచరీలు బాదిన కేన్‌ విలియమ్సన్‌, హెన్రీ నికోల్స్‌

18 Mar, 2023 10:35 IST|Sakshi

వెల్లింగ్టన్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజు ఆటలొ న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌ (215), హెన్రీ నికోల్స్‌ (200 నాటౌట్‌) ద్విశతకాలతో విరుచుకుపడ్డారు. ఫలింతగా కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. డెవాన్‌ కాన్వే (78) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. టామ్‌ లాథమ్‌ (21), డారిల్‌ మిచెల్‌ (17) తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో కసున్‌ రజిత 2, ధనంజయ డిసిల్వ, ప్రభాత్‌ జయసూర్య తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.  

కేన్‌ మామకు ఆరోది, నికోల్స్‌కు తొలి ద్విశతకం..
285 బంతుల్లో కెరీర్‌లో ఆరో ద్విశతకం పూర్తి చేసిన విలియమ్సన్‌.. దిగ్గజ ఆటగాళ్లు మర్వన్‌ ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్‌, జావిద్‌ మియాందాద్‌, యూనిస్‌ ఖాన్‌, రికీ పాంటింగ్‌ల రికార్డును సమం చేశాడు. విలియమ్సన్‌ సహా వీరందరూ టెస్ట్‌ల్లో ఆరు డబుల్‌ సెంచరీలు చేశారు.

టెస్ట్‌ల్లో అధిక డబుల్‌ సెంచరీల రికార్డు దిగ్గజ డాన్‌ బ్రాడ్‌మన్‌ పేరిట ఉంది. బ్రాడ్‌మన్‌ 52 టెస్ట్‌ల్లో ఏకంగా 12 ద్విశతకాలు బాదాడు. మరోవైపు విలియమ్సన్‌తో పాటు మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన హెన్రీ నికోల్స్‌ కూడా డబుల్‌ బాదాడు. 240 బంతుల్లో 200 పరుగులతో అజేయంగా నిలిచిన నికోల్స్‌కు ఇది కెరీర్‌లో తొలి ద్విశతకం. 

కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో సూపర్‌ సెంచరీతో (121) మెరిసిన కేన్‌ మామ.. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా డబుల్‌ సెంచరీతో (215) చెలరేగాడు. కేన్‌ మామకు ఇది హ్యాట్రిక్‌ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్‌ మామ శతక్కొట్టాడు (132).

మరిన్ని వార్తలు