ఐదు రోజుల వ్యవధిలో మరోసారి విరుచుకుపడిన కేన్‌ మామ

18 Mar, 2023 08:09 IST|Sakshi

వెల్లింగ్టన్‌: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిధ్య న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. వర్షం, వెలుతురులేమి కారణంగా తొలి రోజు కేవలం 48 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా, రెండో రోజు ఆట నిర్దిష్ట సమయానికి ప్రారంభమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసిన న్యూజిలాండ్‌.. రెండో రోజు ఆటలో భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తుంది.

తొలి టెస్ట్‌లో సూపర్‌ సెంచరీతో (121) తన జట్టుకు అపురూప విజయాన్నందించిన కేన్‌ విలియమ్సన్‌ ఐదు రోజుల వ్యవధిలో మరో సెంచరీతో (188 నాటౌట్‌) మెరిశాడు. కేన్‌ మామకు ఇది హ్యాట్రిక్‌ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్‌ మామ శతక్కొట్టాడు (132). మరోవైపు కేన్‌ మామతో హెన్రీ నికోల్స్‌ (113 నాటౌట్‌) సైతం సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ పోటాపోటీ శతకాలతో విరుచుకుపడటంతో 106 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 425/2గా ఉంది. విలియమ్సన్‌ (188), హెన్రీ నికోల్స్‌ (114) క్రీజ్‌లో ఉన్నారు.

తొలి రోజు ఆటలో డెవాన్‌ కాన్వే (78) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. టామ్‌ లాథమ్‌ (21) పర్వాలేదనిపించాడు. 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు