పాక్‌ పర్యటన రద్దుపై స్పందించిన న్యూజిలాండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌

19 Sep, 2021 08:38 IST|Sakshi

Everything changed.. NZC Defends Decision To Abort Pak Tour: పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు తొలి వన్డే(సెప్టెంబర్‌ 17)కు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్‌ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత పాక్‌లోనే రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపిన 34 మంది సభ్యుల న్యూజిలాండ్‌ బృందం ఆదివారం వేకువజామున దుబాయ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ జట్టు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ మాట్లాడుతూ.. అత్యంత భయానక పరిస్థితుల నుంచి బయటపడ్డామని తెలిపాడు. 

మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు తమ దేశ సెక్యూరిటీ విభాగం హెచ్చరిక మేరకు తాము అలర్ట్‌ అయ్యామని, ఆ సమయంలో పరిస్థితులంతా ఒక్కసారిగా మారిపోయాయని, న్యూజిలాండ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే తప్పనిసరి పరిస్థితుల్లో పర్యటన రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించాడు. పాక్‌ క్రికెట్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నాడు. తమ బృంద సభ్యులు 24 గంటల పాటు దుబాయ్‌లోనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటారని, అనంతరం 21 మంది వారం వ్యవధిలో స్వదేశానికి తిరిగి వెళ్తారని, మిగిలిన సభ్యులు టీ20 ప్రపంచకప్‌ బృందంతో కలుస్తారని తెలిపారు.

ఇదిలా ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ తీసుకున్న నిర్ణయంపై పాక్‌ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సెక్యూరిటీ హెచ్చరిక లేదు.. ఏదీ లేదు.. అదంతా వట్టి డ్రామా.. హామీ ఇచ్చినా సిరీస్‌ను రద్దు చేసుకోవడం దారుణమని షాహిద్‌ అఫ్రిది మండిపడగా.. "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది" అంటూ ఆ దేశ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు. మరోవైపు సిరీస్‌ రద్దుపై న్యూజిలాండ్‌ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సైతం పాక్‌ పర్యటనపై పునరాలోచన చేస్తామని ప్రకటించిన విషయం విధితమే. కాగా, పాక్‌ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉండింది. 
చదవండి: గంటల వ్యవధిలో పాక్‌ క్రికెట్‌కు మరో షాక్‌.. ?

మరిన్ని వార్తలు