WC 2023: చెలరేగిన మగల, బవుమా.. వెస్టిండీస్‌ పాలిట శాపంలా సౌతాఫ్రికా! ‘ప్రపంచకప్‌’ రేసులో..

1 Apr, 2023 11:28 IST|Sakshi

South Africa Beat Netherlands By 8 Wickets: ఐసీసీ క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా సౌతాఫ్రికా మరో ముందుడుగు వేసింది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించి.. వెస్టిండీస్‌ జట్టుకు నిద్రపట్టకుండా చేసింది. మరొక్క గెలుపు సాధిస్తే చాలు ప్రపంచకప్‌ రేసులో ప్రొటిస్‌ ముందుకు వెళ్తుంది. 

కాగా బెనొని వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డే(రీ షెడ్యూల్డ్‌)లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న  ప్రొటిస్‌కు సిసంద మగల శుభారంభం అందించాడు. 

డచ్‌ ఓపెనర్లు విక్రమ్‌జిత్‌ సింగ్‌(45), మాక్స్‌ ఒడౌడ్‌(18)లను అవుట్‌ చేసిన మగల.. తేజ నిడమనూరు(48) రూపంలో మరో కీలక వికెట్‌ పడగొట్టాడు. మిగతా బౌలర్లలో మార్కో జాన్సన్‌ ఒకటి, నోర్జే రెండు, షంసీ మూడు, మార్కరమ్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలో 46.1 ఓవర్లలో నెదర్లాండ్స్‌ 189 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 30 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. కెప్టెన్‌ తెంబా బవుమా 90 పరుగులతో అజేయంగా నిలవగా.. ఎయిడెన్‌ మార్కరమ్‌ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయం అందించారు.

పాపం విండీస్‌.. అయితే సౌతాఫ్రికా మాత్రం
ఇక ఈ గెలుపుతో పది పాయింట్లు సాధించిన సౌతాఫ్రికా.. సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో శ్రీలంకను వెనక్కినెట్టి తొమ్మిదో స్థానానికి దూసుకువచ్చింది. నెదర్లాండ్స్‌తో మిగిలి ఉన్న ఆఖరి వన్డేలో ప్రొటిస్‌ విజయం సాధిస్తే వెస్టిండీస్‌ను వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకుతుంది.

తద్వారా ప్రపంచకప్‌-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. అయితే, మూడో వన్డేలో గెలవడంతో పాటు.. బంగ్లాదేశ్‌- ఐర్లాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఫలితం తేలిన తర్వాతే సౌతాఫ్రికాకు బెర్తు ఖరారు అవుతుందా? లేదోనన్న విషయంపై స్పష్టత వస్తుంది.

ఒకవేళ నెదర్లాండ్స్‌ ఓడి.. ఐర్లాండ్‌కు బంగ్లా చేతిలో ఓటమి ఎదురైతే.. విండీస్‌కు ఘోర పరాభవం తప్పదు. టీ20 ప్రపంచకప్‌-2023 క్వాలిఫయర్స్‌ ఆడిన వెస్టిండీస్‌ వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ కూడా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది.

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌-2023 సూపర్‌లీగ్‌ పాయింట్ల పట్టిక:


PC: ICC
చదవండి: IPL 2023: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్‌.. తొలి భారత క్రికెటర్‌గా!
IPL 2023: గుజరాత్‌కు బిగ్‌ షాక్‌.. విలియమన్స్‌కు తీవ్ర గాయం! ఐపీఎల్‌ మొత్తానికి దూరం

మరిన్ని వార్తలు