జాతివివక్ష వ్యాఖ్యలు.. ఇంగ్లీష్‌ క్రికెటర్‌కు భారీ ఊరట

4 Jul, 2021 15:51 IST|Sakshi

లండన్‌: జాతివివక్ష వ్యాఖ్యలు, విద్వేషాలకు సంబంధించిన ట్వీట్లు చేసి ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌కు భారీ ఊరట లభించింది. తాజాగా ఈ అంశంపై విచారణ పూర్తి చేసిన ఈసీబీ రాబిన్‌సన్‌పై మొత్తంగా 8 మ్యాచ్‌ల నిషేధం, 3,200 పౌండ్ల జరిమానా విధించింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరమైన రాబిన్‌సన్‌.. మరో ఐదు మ్యాచ్‌లను రెండేళ్ల కాలవ్యవధిలో నిషేధం ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో అతను వెంటనే ఇంగ్లండ్‌ జట్టులో కలిసే అవకాశం లభించనుంది. త్వరలో భారత్‌తో జరుగబోయే ఐదు టెస్ట్‌ సిరీస్‌ కోసం అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఈసీబీ అధికరి ఒకరు వెల్లడించారు.

కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టులో రాబిన్‌సన్‌ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో 2012-13 కాలంలో అతడు చేసిన జాతివివక్ష, విద్వేషపూరిత ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఈసీబీ అతనిపై చర్యలు చేపట్టింది. లార్డ్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో రాబిన్సన్‌ అదిరిపోయే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగాడు. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. కానీ, ఆ మ్యాచ్‌ పూర్తవ్వగానే ఈసీబీ అతడిపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై అతను బహిరంగ క్షమాపణలు కోరినప్పటికీ ఈసీబీ కనికరించకపోవడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. 

>
మరిన్ని వార్తలు