Eng Vs Ind 3rd Test: రాబిన్‌సన్ 5 వికెట్ల ప్రదర్శన.. వీడియోలు

28 Aug, 2021 19:13 IST|Sakshi

లీడ్స్‌: లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పోరాటం ముగిసింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్  జట్లు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో భారత్ జట్టుని ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 215/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 278 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ని ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది.

కాగా ఇంగ్లండ్‌ విజయంలో ఫాస్ట్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌  కీలక పాత్ర పోషించాడు. టీమిండియా మిడిలార్డర్‌ను కుప్పకూల్చాడు. 5 వికెట్లతో చెలరేగిన రాబిన్‌సన్ భారత పతనాన్ని శాసించాడు. ఈ సిరీస్‌లో రెండో 5 వికెట్ల హాల్‌ సాధించాడు.

పుజారా వికెట్‌తో కథ మొదలు
మ్యాచ్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే  చతేశ్వర్ పుజారా (91) ఓలి రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి శతకం చేజార్చుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికే కోహ్లీ ఔట్ అయ్యాడు. ఇక అక్కడినుంచి భారత్ వికెట్ల పతనం మొదలైంది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. అజింక్య రహానే (10),  రిషబ్ పంత్‌ (1),  మహ్మద్‌ షమీ (6), ఇషాంత్ శర్మ (2), రవీంద్ర జడేజా (30), మహమ్మద్ సిరాజ్‌ (0) కనీస పోరాటం చేయకుండా వెనుదిరిగారు.

జస్ప్రీత్ బుమ్రా (1) నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో  జడేజా (30)  కొద్ది సేపు బౌండరీలతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్‌ ఐదు వికెట్లు తీయగా,క్రెయిగ్ ఓవర్టన్‌ మూడు వికెట్లు తీశాడు. జేమ్స్ అండర్సన్‌, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. ఈ  మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు తీసిన రాబిన్‌సన్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది.

చదవండి: చరిత్ర సృష్టించిన ఆండర్సన్‌.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు

మరిన్ని వార్తలు