టోక్యో ‘జ్యోతి’ బయల్దేరింది

26 Mar, 2021 06:35 IST|Sakshi

టోక్యో:  టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై ఆశలు రేపుతూ ‘టార్చ్‌ రిలే’ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. 2011లో భూకంపం, సునామీ, న్యూక్లియర్‌ విస్ఫోటనాల ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఫుకుషిమా వద్ద ఈ జ్యోతిని వెలిగించి పరుగు ప్రారంభించడం విశేషం. 2011 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలైన అజుసా ఇవషిమిజు చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది.  జపాన్‌లోని 47 ప్రాంతాల మీదుగా ప్రయాణించే టార్చ్‌ 121 రోజుల తర్వాత క్రీడల ప్రారంభం రోజైన జులై 23కు టోక్యో చేరుకుంటుంది. ‘జపాన్‌ దేశవాసులకే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రజలకు కూడా టోక్యో 2020 జ్యోతి కొత్త వెలుగులు పంచుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుత కష్టకాలంలో చీకటి తర్వాత వెలుతురు ఉంటుందనే సందేశంతో టార్చ్‌ పయనిస్తుంది’ అని నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమొటో వ్యాఖ్యానించారు.  

>
మరిన్ని వార్తలు