ఒలింపిక్‌ పతక విజేతను కబళించిన క్యాన్సర్‌

14 Oct, 2020 09:19 IST|Sakshi

అథ్లెట్‌ చార్లీ మూర్‌ కన్నుమూత

వాషింగ్టన్‌: అలనాటి మేటి అథ్లెట్, ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత చార్లీ మూర్‌ (అమెరికా) కన్ను మూశారు. 91 ఏళ్ల చార్లీ మూర్‌ కొంతకాలంగా పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి ఆయన మృతి చెందినట్లు ప్రపంచ అథ్లెటిక్స్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఫిన్‌లాండ్‌ రాజధాని హెల్సింకి వేదికగా జరిగిన 1952 ఒలింపిక్స్‌లో బరిలో దిగిన ఆయన 400 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. అంతేకాకుండా 1600 మీటర్ల రిలే ఈవెంట్‌లో పాల్గొన్న మూర్‌ అమెరికాకు రజత పతకాన్ని సాధించి పెట్టారు. అనంతరం జరిగిన బ్రిటిష్‌ ఎంపైర్‌ గేమ్స్‌లో పాల్గొని 440 మీటర్ల హర్డిల్స్‌లో 51.6 సెకన్లలో గమ్యాన్ని చేరి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

1978లో కార్నెల్స్‌ అథ్లెటిక్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌తోపాటు 1999లో యూఎస్‌ఏ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ హాల్‌ ఫేమ్‌లో మూర్‌ చోటు దక్కించుకున్నారు. కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మూర్‌ వ్యాపారవేత్తగా, ఇన్వెస్టర్‌గా, అథ్లెటిక్స్‌ పాలనాధికారిగా పలు బాధ్యతలను నిర్వర్తించారు. తన కెరీర్‌కు తోడ్పాటు అందించిన మెర్సెర్స్‌బర్గ్‌ అకాడమీకి తాను సాధించిన రెండు ఒలింపిక్‌ పతకాలను విరాళంగా ఇచ్చారు. హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు మూర్‌ ‘13 స్టెప్‌ అప్రోచ్‌’ టెక్నిక్‌ను సూచించారు. దీనిని  అథ్లెట్స్‌ ఇప్పటికీ హర్డిల్స్‌లో ఉపయోగిస్తుండటం విశేషం. 
(చదవండి: ధోనిపై విమర్శలకు, ఫ్యాన్‌ సమాధానం)

మరిన్ని వార్తలు