Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు విశిష్ట పురస్కారం

25 Jan, 2022 18:08 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నీరజ్‌ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించనుంది. జనవరి 26న రిపబ్లిక్‌ డే రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నీరజ్‌చోప్రాకు పతకం అందించనున్నాడు. ఇక ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా నిలిచాడు.

చదవండి: Australian Open Grandslam 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్‌, యాష్లే బార్టీ

గతంలో 2008లో బీజింగ్‌ ఒలింపిక్స్‎లో షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత నీరజ్ సాధించిన స్వర్ణమే రెండోది. నీరజ్ గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. ఇక ఇండియన్‌ ఆర్మీలో నీరజ్‌ చోప్రా  జూనియర్‌ కమీషన్డ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 384 మంది రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులతో సత్కరించనున్నారు. అవార్డులలో 12 శౌర్య చక్రాలు, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, 13 యుద్ధ సేవా పతకాలు, మూడు బార్ టు విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 122 విశిష్ట సేవా పతకాలు, 81 సేన పతకాలు, రెండు వాయు సేన పతకాలు, 40 సేన పతకాలు, ఎనిమిది నేవీసేన పతకాలు, 14 నావో సేన పతకాలతో విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు.

చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ'

మరిన్ని వార్తలు