Simon Byles: విజయాలే భారమై...

29 Jul, 2021 04:48 IST|Sakshi

‘మనోవేదన’ ఇంతింత కాదయా!

ఆల్‌ అరౌండ్‌ ఈవెంట్‌ నుంచి తప్పుకున్న సిమోన్‌ బైల్స్‌

తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌   

టోక్యో: రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, వివిధ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లలో కలిపి ఏకంగా 19 స్వర్ణాలు... మొత్తంగా అంతర్జాతీయ వేదికపై 36 పతకాలతో జిమ్నాస్టిక్స్‌ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువ తార సిమోన్‌ బైల్స్‌.  

►టోక్యో ఒలింపిక్స్‌కు తమ దేశం తరఫున మరో సారి భారీ అంచనాలతో వెళ్లిన బైల్స్‌ను మానసిక సమస్యలు వీడటం లేదు. మంగళవారం టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో ఒక్క ‘వాల్ట్‌’లోనే ఒకే ఒక ప్రయత్నం చేసి తప్పుకున్న బైల్స్‌... గురువారం జరిగే ఆల్‌ ఆరౌండ్‌ ఈవెంట్‌లో కూడా పాల్గొనడం లేదని ప్రకటించింది. ప్రస్తుతం తాను మానసికంగా సిద్ధంగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. వచ్చేవారంలో జరిగే వ్యక్తిగత ఈవెంట్లలో కూడా ఆమె పాల్గొంటుందా లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ప్రతీ రోజు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటా మని అమెరికా ఒలింపిక్‌ వర్గాలు వెల్లడించాయి.  

ఒత్తిడి పెరిగిపోయిందా..!
జాగ్రత్తగా చూస్తే బైల్స్‌ పాల్గొనే ఈవెంట్లలో ఆమె ధరించే డ్రెస్‌పై ఏదో ఒక మూల ‘మేక’ బొమ్మ ము ద్రించి ఉంటుంది. ఇది ఏదో రాశిని బట్టి పెట్టుకు న్నది కాదు... ఎౖఅఖీ (ఎట్ఛ్చ్ట్ఛట్ట ౖజ అ ∙ఖీజీఝ్ఛ)... చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌ అని గుర్తు చేయడం దాని ఉద్దేశం!  ఒలింపిక్స్‌లో తన సత్తా చాటేందుకు ఆమె టోక్యో బయల్దేరినప్పుడు అమెరికా విమానయాన సంస్థ ‘యునైటెడ్‌’ కూడా ఫ్లయిట్‌లో ఇలాంటి వస్తువులే ఇచ్చి గౌరవం ప్రదర్శించుకుంది. మైకేల్‌ ఫెల్ప్స్‌ లాంటి దిగ్గజం లేకపోవడంతో అమెరికా దేశానికి ఈ ఒలింపిక్స్‌లో ఆమె ఒక ‘ముఖచిత్రం’ తరహాలో మారిపోయింది.  
► ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు ఒకవైపు తన బ్రాండ్‌ పేరును కాపాడుకోవాలి. స్పాన్సర్లను సంతోషపెట్టాలి. అటు అభిమానులను అలరించాలి. ఇటు ఇంటా, బయటా విమర్శకులకు సమాధానమివ్వాలి. ఇదంతా 24 ఏళ్ల బైల్స్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. టోక్యోలో ఆమె మానసికంగా కుప్పకూలిపోవడం అనూహ్యమేమీ కాదు.  

► ‘రియో’ విజయాల తర్వాత చాలాసార్లు ఆమె మానసికంగా ఆందోళనకు గురైంది. కిడ్నీలో రాయితో ఇబ్బంది పడుతున్న దశలో కూడా అందరి కోసం ఆమె 2018 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగాల్సి వచ్చింది. కరోనా సమయంలో హ్యూస్టన్‌లోని తన ఇంట్లో ఉన్న సమయంలో వరుసగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు రావడం, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగడం బైల్స్‌ను బాగా ఇబ్బంది పెట్టింది (జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నయోమి ఒసాకా కూడా ఇదే కారణం చెబుతూ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తప్పుకుంది).  

► అమెరికా ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ సందర్భంగా ఆమె సహచరి సునీసా లీకంటే కూడా బైల్స్‌ వెనుకబడింది. గత ఎనిమిదేళ్లలో ఇలా జరగలేదు. గత రియో ఒలింపిక్స్‌లో బైల్స్‌పై ఏ ఒత్తిడి లేదు. స్వేచ్ఛగా, చలాకీగా విన్యాసాలు ప్రదర్శిస్తూ పతకాలు కొల్లగొట్టింది.  
 

► తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం ‘వాల్ట్‌’ విన్యాసం చేసినప్పుడు ఆమెలో ఉత్సా హం కనిపించలేదు. 2 1/2 ట్విస్ట్‌లు చేయాల్సిన చోట 1 1/2 ట్విస్ట్‌కే పరిమితమైంది. సరిగ్గా చెప్పాలంటే కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని భయపడే కొత్త జిమ్నాస్ట్‌లాగా కనిపించింది. ఎంతో సాధించిన తర్వాత ఇంకా రిస్క్‌ చేసి ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకనే భావన ఆమె వ్యాఖ్యల్లోనూ వినిపించింది. తాను పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో లేకపోయినా సరే... అందరినీ సంతృప్తిపరచడం కోసమే బైల్స్‌ ఒలింపిక్స్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యక్తిగత విభాగంలోనూ ఆమె పోటీ పడకపోవచ్చు!


ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కుదురుగా కూర్చొని నా మానసిన సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని అనిపించింది. వివరంగా చెప్పలేను కానీ కొన్ని అంశాల్లో నా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. నాకు ఎలాంటి గాయం లేదు. మనసు ఎక్కడో ఉండి బరిలోకి దిగి... లేని గాయాలు తెచ్చుకునే పిచ్చి పనిని నేను చేయదల్చుకోలేదు. ఒలింపిక్స్‌కు వచ్చాక నేను నా కోసం కాకుండా ఇంకెవరి కోసమే ఆడుతున్నట్లు అనిపించింది. ఇది నన్ను బాధించింది. పేరు ప్రతిష్టలను పక్కన పెట్టి నా ఆరోగ్యానికి ఏది సరైందో ఆ నిర్ణయం తీసుకోవడం అవసరం. మళ్లీ పోటీల్లో పాల్గొంటానో లేదో చివరి నిమిషం వరకు చెప్పలేను.     
–సిమోన్‌ బైల్స్, అమెరికా జిమ్నాస్ట్‌   

మరిన్ని వార్తలు