Olympic Marathon1904: మొత్తం గందరగోళం!

16 May, 2021 12:52 IST|Sakshi

నాస్టాల్జియా 

1904 ఒలింపిక్స్‌ మారథాన్‌ అత్యంత గందరగోళం నెలకొన్న క్రీడగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ ఏడాది తొలిసారి విశ్వక్రీడలు అమెరికాలో జరిగాయి. సెయింట్‌లూయిస్‌ నగరం పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. సుదీర్ఘ పరుగు మారథాన్‌ కొండలు, ఎగుడు దిగుడు, రాళ్లు, మట్టి కలగలసి ఉన్న దారిలో సాగింది. ఈ పోటీల్లో మొత్తం 32 మంది పాల్గొన్నారు. వీరంతా ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, గ్రీస్, క్యూబాకు చెందిన వాళ్లు. పోటీలకు ఎంపిక చేసిన మార్గం కఠినంగా ఉండడంతోపాటు భరించరాని వేడి, ఉక్కపోతతో క్రీడాకారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వల్లకాక సగం మంది మధ్యలోనే పందెం విరమించుకోగా ఆఖరికి 14 మంది మాత్రం గమ్యస్థానం చేరుకున్నారు. వీరిలో తొలుత ఫినిష్‌ లైన్‌ను చేరుకున్న క్రీడాకారుడిగా ఫ్రెడ్‌ లోర్జ్‌ను నిర్వాహకులు ప్రకటించారు.

అయితే, అతను రేసు మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని, కొద్ది దూరం కారులో ప్రయాణించాడని, ఆ కారు కూడా మధ్యలో ఆగిపోవడంతో తిరిగి పరుగు ప్రారంభించాడని ఓ సహ క్రీడాకారుడు బయటపెట్టాడు. దీనిని లోర్జ్‌ సైతం అంగీకరించాడు. ప్రాక్టిక్‌ల్‌ జోక్‌ చేసేందుకే తాను అలా ప్రవర్తించానని అతను చెప్పుకొచ్చాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్వాహకులు ఏడాది నిషేధం విధించారు.

ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన థామస్‌ హిక్స్‌ను విజేతగా ప్రకటించారు. వాస్తవానికి హిక్స్‌ తుది లైన్‌ను తన సహాయకుల సాయంతో చేరుకోవాల్సి వచ్చింది. కారణమేంటంటే రేసులో బాగా పరిగెత్తేందుకు ఉపకరిస్తుందని అతను మార్గమధ్యలో గుడ్లు, బ్రాందీ, స్ట్రైచిన్‌ సల్ఫేట్ర్‌ మిశ్రమ ద్రావణాన్ని తీసుకున్నాడు. ఇది క్రీడల చరిత్రలో నమోదైన డ్రగ్స్‌ సంఘటనగా గుర్తింపు పొందింది.  స్ట్రైచిన్‌.. ఎలుకలు, పక్షులను చంపేందుకు ఉపయోగించే రసాయన మందు. ఈ విషయం తెలియక హిక్స్‌ ఆ మిశ్రమాన్ని తాగడంతో అతనికి వాంతులు అయ్యాయి. ఫలితంగా తుదిలైన్‌కు చేరుకుంటాడనగా నీరసపడి కిందపడ్డాడు.

అతని శిక్షకులు  హిక్స్‌ను రెండు భుజాలపై మోస్తూ  తుదిలైన్‌కు చేర్చారు. అతడినే విజేతగా ప్రకటించారు. ఇక నాలుగో స్థానంలో నిలిచిన క్యూబా క్రీడాకారుడు ‘‘కార్బజాది’’ మరో విచిత్ర గాథ. అతను పోటీల్లో పాల్గొనేందుకు విరాళాల రూపంలో తెచ్చుకున్న డబ్బును అమెరికాలో దిగగానే పోగొట్టుకున్నాడు. చచ్చీచెడి పోటీలకు చేరుకున్నప్పటికీ అతని వస్త్రధారణ పోటీలకు అనుగుణంగా లేదు. దాంతో మరో సహచరుడు కార్బజా ప్యాంటును కత్తిరించి షార్ట్‌ లాగా చేశాడు.

అంతటితో కార్బజా కష్టాలు తీరలేదు. అతను పోటీలకు ముందు తిన్న యాపిల్స్‌ కారణంగా పరుగు మధ్యలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. అయినా సరే కాసేపు విశ్రాంతి తీసుకొని, తిరిగి పోటీల్లో పాల్గొని నాలుగో స్థానం పొందడం విశేషం. ఇక తొమ్మిదో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా క్రీడాకారుడు లెన్‌ టావుది మరో కష్టం.  మార్గమధ్యలో కుక్కలు అతని వెంటపడ్డాయి. దీంతో అతను మెరుగైన స్థానంలో నిలిచే అవకాశం కోల్పోయాడు.
చదవండి: బాల్‌ ట్యాంపరింగ్‌ చేస్తున్నానని వారికీ తెలుసు: ఆసీస్‌ క్రికెటర్‌ బాన్‌క్రాఫ్ట్‌

మరిన్ని వార్తలు