Vijender Singh: ఉద్యోగం కోసమే మొదలెట్టాడు.. విధిరాత మరోలా ఉంది! ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకని వారించినా!

26 Feb, 2023 10:39 IST|Sakshi
ఒలంపిక్‌ పతక విజేత విజేందర్‌ సింగ్‌ (PC: Vijender Singh Instagram)

Achievers- Vijender Singh: బాక్సింగ్‌ను మన దేశంలో చాలా మంది ఒక ఆటగానే చూడరు. బాక్సర్లంటే గొడవలు చేసేవాళ్లనో లేదంటే పిచ్చివాళ్లుగానో ముద్ర వేస్తారు.. చాలా కాలంగా, చాలా మందిలో ఉన్న అభిప్రాయమది. ఆ కుర్రాడు కూడా మొదట్లో అలాగే అనుకున్నాడు. అందుకే ఆ ఆటకు దూరంగా ఉండటమే మేలనుకున్నాడు. 

కానీ తన ప్రమేయం లేకుండానే బాక్సింగ్‌ వైపు ఆకర్షితుడయ్యాడు. ఒక ఉద్యోగం పొందడానికి ఆ ఆట ఉంటే సరిపోతుందని సాధన చేశాడు. ఏకంగా ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశం గర్వించదగిన బాక్సర్‌గా నిలిచాడు. అతడే విజేందర్‌ సింగ్‌ బేనివాల్‌... ఒలింపిక్స్‌లో మెడల్‌ గెలుచుకున్న తొలి భారత బాక్సర్‌. 

హరియాణాలోని భివానీ పట్టణం.. ఢిల్లీ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో దాదాపు 2 లక్షల జనాభాతో ఉంటుంది. ఆ రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను అందించిన ఊరు. రాజకీయపరమైన విశేషాన్ని పక్కన పెడితే అది భారత బాక్సింగ్‌కు సంబంధించి ఒక పెద్ద అడ్డా.

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)కు చెందిన కోచింగ్‌ కేంద్రం అక్కడ ఉండటంతో ఎంతో మంది బాక్సర్లు అక్కడి నుంచి వెలుగులోకి వచ్చారు. రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన హవా సింగ్‌ పట్టుబట్టి మరీ ‘సాయ్‌’ కేంద్రాన్ని అక్కడికి తీసుకొచ్చారు. అనంతరం అది అద్భుతమైన ఫలితాలను అందించింది.


PC: Vijender Singh Instagram

ఒకే ఒక్కడు..
విజేందర్‌ సింగ్‌ కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఐదుగురు బాక్సర్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తే అందులో నలుగురు.. ‘మినీ క్యూబా’గా పిలిచే భివానీ సెంటర్‌కు చెందినవారు కావడంతో ఒక్కసారిగా దాని గుర్తింపు పెరిగిపోయింది. ఈ ఐదుగురిలో విజేందర్‌ సింగ్‌ ఒక్కడే సత్తా చాటి కాంస్య పతకంతో మెరిశాడు. భారత బాక్సింగ్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 

అన్న స్ఫూర్తితో..
విజేందర్‌ తండ్రి హరియాణా ఆర్టీసీలో డ్రైవర్‌. మరీ పెద్ద సంపాదన కాదు. కానీ ఇద్దరు పిల్లల్ని బాగా చదివించాలనే తాపత్రయంతో సాధ్యమైనంతగా కష్టపడేవాడు. అయితే పెద్ద కొడుకు మనోజ్‌ సహజంగానే స్థానిక మిత్రుల సాన్నిహిత్యంతో బాక్సింగ్‌ వైపు వెళ్లాడు.

గొప్ప విజయాలు సాధించకపోయినా.. స్పోర్ట్స్‌ కోటాలో ఆర్మీలో ఉద్యోగం దక్కించుకునేందుకు అది సరిపోయింది. విజేందర్‌కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అన్నకు ఉద్యోగం వచ్చి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడింది.

దాంతో అప్పటి వరకు బాగానే చదువుతున్న విజేందర్‌కు చదువుకంటే ఆటనే బాగుంటుందనిపించింది. చివరకు తండ్రి, అన్న కూడా అతడిని కాదనలేకపోయారు. దాంతో పూర్తి స్థాయిలో బాక్సింగ్‌ శిక్షణ వైపు మళ్లించారు. సహజ ప్రతిభ కనబర్చిన అతను ఆటలో వేగంగా మంచి ఫలితాలు సాధించాడు. 


భార్యాపిల్లలతో విజేందర్‌సింగ్‌
PC: Vijender Singh Instagram

వరుస విజయాలు..
హరియాణా రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచిన తర్వాత 12 ఏళ్ల వయసులో జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌  కావడంతో తొలిసారి విజేందర్‌కు గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో 2003లో జరిగిన ఆఫ్రో ఏషియన్‌ గేమ్స్‌ అతని కెరీర్‌కు కీలకంగా మారాయి. అప్పటికి జూనియర్‌ స్థాయిలోనే ఆడుతున్నా.. పట్టుదలగా పోటీ పడి సీనియర్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న విజేందర్‌ రజతంతో సత్తా చాటాడు.

అయితే ఇదే ఊపులో 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ కోసం సిద్ధమైన విజేందర్‌కు షాక్‌ తగిలింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా అతను తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. దాంతో తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని విజేందర్‌కు అర్థమైంది. 

ఒలింపిక్‌ పతకం వైపు..
ఏథెన్స్‌ ముగిసిన రెండేళ్ల తర్వాత విజేందర్‌ కెరీర్‌ కీలక మలుపు తీసుకుంది. తన వెయిట్‌ కేటగిరీని మార్చుకోవాలని అతను తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను అందించింది. 75 కేజీల మిడిల్‌వెయిట్‌కు అతను మారాడు. అదే ఏడాది దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన విజేందర్‌.. ఆ ఏడాదే కామన్వెల్త్‌ క్రీడల్లోనూ రజత పతకం గెలుచుకున్నాడు.

దాంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జర్మనీలో ప్రత్యేక శిక్షణ అనంతరం అది రెట్టింపైంది. ఒలింపిక్స్‌లోనూ రాణించగలననే నమ్మకంతోనే అతను బీజింగ్‌లో అడుగు పెట్టాడు. చివరకు దానిని సాధించడంలో విజేందర్‌ సఫలమయ్యాడు. 22 ఆగస్టు, 2008న కంచు పతకం సాధించి ఒలింపిక్స్‌లో ఈ ఘనత నమోదు చేసి తొలి భారత బాక్సర్‌గా వేదికపై సగర్వంగా నిలిచాడు.

ఈ విజయంలో ఒక్కసారిగా విజేందర్‌ను కీర్తి, కనకాదులు వరించాయి. కానీ అతను ఏ దశలోనూ ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ఒలింపిక్‌ పతకం తర్వాత కూడా వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌ షిప్‌లో వరుస పతకాలు గెలుచుకున్నాడు. వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ సొంతం చేసుకున్నాడు. 


PC: Vijender Singh Instagram

డ్రగ్స్‌ వివాదాన్ని దాటి..
ఆటగాడిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన తర్వాత ఒలింపిక్స్‌ మెడల్‌ గెలిచిన నాలుగేళ్లకు విజేందర్‌ కెరీర్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా స్పోర్ట్స్‌మన్‌ డ్రగ్స్‌ అంటే నిషేధిత ఉత్ప్రేరకాలే అని వినిపిస్తుంది. కానీ ఇది అలాంటిది కాదు. విజేందర్‌ హెరాయిన్‌ తదితర డ్రగ్స్‌ను తీసుకుంటూ పట్టుబడ్డాడని పోలీసులు ప్రకటించారు.

ఒక డ్రగ్‌ డీలర్‌ ఇంటి ముందు విజేందర్‌ భార్య కారు ఉండటం కూడా పోలీసు విచారణంలో కీలకంగా మారింది.  పోటీలు లేని సమయంలో తీసుకునే డ్రగ్స్‌కు సంబంధించి తాము పరీక్షలు చేయలేమంటూ జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించడం విజేందర్‌కు ఊరటనిచ్చింది.

అయితే యువ ఆటగాళ్లపై ఇలాంటి ఘటనలు ప్రభావితం చూపిస్తాయంటూ నేరుగా కేంద్రప్రభుత్వం ఆదేశించడంతో ‘నాడా’ పరీక్షలు నిర్వహించింది. దాదాపు 14 నెలలు వివాదం సాగిన తర్వాత విజేందర్‌కు ‘క్లీన్‌చిట్‌’ లభించింది.  

పురస్కారాలు
ఆటగాడిగా అద్భుత ప్రదర్శనకు భారత ప్రభుత్వం అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న విజేందర్‌ సింగ్‌... పలు సంస్థలకు మాడలింగ్‌ చేయడంతో పాటు  ‘పగ్లీ’ అనే బాలీవుడ్‌ సినిమాలోనూ నటించాడు. త్వరలో రాబోయే సల్మాన్‌ ఖాన్‌ సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’లోనూ అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు.  

ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ వైపు..
ఇతర భారత బాక్సర్లతో పోలిస్తే విజేందర్‌ సింగ్‌ కెరీర్‌ కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఒలింపిక్‌ పతకం అందించిన అమెచ్యూర్‌ బాక్సింగ్‌ను దాటి ఏ భారత బాక్సర్‌ ఆలోచించలేదు. కానీ విజేందర్‌ మాత్రం సాహసం ప్రదర్శించాడు. అమెచ్యూర్‌తో పోలిస్తే ఎంతో ప్రమాదకరంగా, రక్షణ ఉపకరణాలు వాడే అవకాశం లేని ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టాడు.

‘సాధించిన పేరు ప్రతిష్ఠలు చాలు. ఇప్పుడు ఇదంతా అవసరమా? లేనిపోని ప్రమాదం కొనితెచ్చుకోవడమే’ అని సహచరులు వారించినా అతను వెనుకడుగు వేయలేదు. నేను బాక్సర్‌ను, ఎక్కడైనా పోరాడతాను అంటూ తన గురించి తాను చెప్పుకున్న విజేందర్,  2015 అక్టోబరులో తొలిసారి ఇందులోకి అడుగు పెట్టాడు.

అంచనాలకు మించి రాణించిన అతను అక్కడా మంచి విజయాలు అందుకున్నాడు. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో 14 బౌట్‌లు ఆడిన అతను 13 గెలిచి ఒకసారి మాత్రమే ఓడాడు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే విజేందర్‌ సింగ్‌ 2011లో ఢిల్లీకి చెందిన అర్చనా సింగ్‌ను వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు అబీర్‌ సింగ్‌, అమ్రిక్‌ సింగ్‌ సంతానం. 
-మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది 

చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్‌ చేస్తే 99 శాతం లిఫ్ట్‌ చేయడు.. అలాంటిది..
వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్‌ మాజీ ప్లేయర్‌

మరిన్ని వార్తలు