Gagan Narang: ‘మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌’లో గగన్‌ నారంగ్‌

30 Jun, 2022 02:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత షూటర్, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌కు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కీలక బాధ్యతలు అప్పగించింది. ‘సాయ్‌’ ఆధ్వర్యంలోని మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ)లో సభ్యుడిగా నారంగ్‌ను ఎంపిక చేసింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి వారిని ఒలింపిక్స్‌కు సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా 2014 నుంచి టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌) పని చేస్తోంది.

‘టాప్స్‌’ కోసం ఆటగాళ్లను గుర్తించడం, వారి సన్నాహకాలకు ఆర్ధికపరంగా సహకారం అందించే విషయంలో తగిన సూచనలు, సలహాలు అందించడం, ఫలితాలను పర్యవేక్షించడమే ‘మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌’ బాధ్యత. 2024 పారిస్, 2028 లాస్‌ ఎంజెలిస్‌ ఒలింపిక్స్‌ కోసం అథ్లెట్లను ఎంపిక చేయడంలో తాను భాగస్వామిని కాబోతున్నట్లు హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌ వెల్లడించాడు.

‘స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకొని డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ కోసం ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఎంఓసీ కీలక పాత్ర పోషిస్తోంది. వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్లలో ఆయా ఆటగాళ్ల అవసరాలను గుర్తించి ప్రత్యేక శిక్షణ కోసం నిధులు అందేలా చూడటంతో పాటు అత్యుత్తమ స్థాయి కోచింగ్‌ సౌకర్యం, ఫిట్‌నెస్‌ తదితర అంశాలపై కూడా ఎంఓసీ దృష్టి పెడుతుంది. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తా’ అని గగన్‌ వెల్లడించాడు. 

మరిన్ని వార్తలు