Lovlina Borgohain: బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. టోక్యో ఒలింపిక్స్‌ మెడలిస్ట్‌ సంచలన ఆరోపణలు

25 Jul, 2022 20:48 IST|Sakshi

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ) అధికారులపై టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, భారత స్టార్‌ మహిళా బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ సంచలన ఆరోపణలు చేసింది. బీఎఫ్‌ఐ అధికారులు తన ఇద్దరు కోచ్‌లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ట్విటర్‌ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించింది. తాను ఒలింపిక్ పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్‌ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించడం లేదని, మరో కోచ్ రఫేల్ బెర్గమొస్కోను ఇండియాకు పంపించేశారని ఆమె వాపోయింది.

ఈ కారణంగా తన ప్రాక్టీస్‌ ఆగిపోయిందని, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ సమయంలో కూడా బీఎఫ్‌ఐ ఇలాగే తనతో డర్టీ పాలిటిక్స్‌ చేసిందని పేర్కొంది. బీఎఫ్‌ఐ ఎన్ని నీచ రాజకీయాలు చేసినా తాను కామన్ వెల్త్ క్రీడల్లో పతకం తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. మరో మూడు రోజుల్లో (జులై 28) కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లవ్లీనా ఆరోపణలు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. 
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటనపై యూ టర్న్‌ తీసుకోనున్న మిథాలీ రాజ్‌..?

మరిన్ని వార్తలు