రజతంతో స్వదేశంలో...

27 Jul, 2021 05:56 IST|Sakshi
తన వ్యక్తిగత కోచ్‌ విజయ్‌ శర్మతో సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్, సహాయ మంత్రి నితీశ్‌ ప్రమాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజులతో మీరాబాయి

మీరాబాయికి ఘన స్వాగతం

రూ. 2 కోట్లు నజరానా ప్రకటించిన రైల్వే మంత్రి  

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ తొలి రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించి భారత్‌ గర్వపడేలా చేసిన మీరాబాయి చాను సోమవారం సొంతగడ్డపై అడుగు పెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో ఎయిర్‌పోర్ట్‌ అంతా హోరెత్తింది. మీరా రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, మీడియా తదితరులు అక్కడ చేరడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. భారత ఆర్మీ జవాన్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం మీరాబాయి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్, సహాయ మంత్రి నితీశ్‌ ప్రమాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసింది.

మరోవైపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తమ ఉద్యోగి అయిన మీరాబాయికి రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. 2018 నుంచి నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వేలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (స్పోర్ట్స్‌)గా పని చేస్తున్న మీరాబాయికి పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.     

చైనా లిఫ్టర్‌ డోపింగ్‌ వార్తలతో అలజడి...
మీరాతో పోటీ పడి స్వర్ణం సాధించిన జిహుయ్‌ హౌ ‘డోపింగ్‌’కు పాల్పడినట్లు, నిర్ధారణ అయితే మీరాకు స్వర్ణం లభిస్తుందంటూ సోమవారం ఉదయం నుంచి పలు పత్రికలు, వెబ్‌సైట్లలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పోటీ ముగిసిన రెండు రోజుల తర్వాత జిహుయ్‌కు డోపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుండటం అనుమానాలు రేకెత్తిస్తుందంటూ ఒక భారత మీడియా ప్రతినిధి రాసిన వార్త దీనికంతటికీ కారణమైంది. అయితే ఐఓసీ నుంచి గానీ ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నుంచి గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

భారత ఒలింపిక్‌ సంఘం కూడా తమకేమీ తెలీదని స్పష్టం చేసింది. నిజానికి కనీస సమాచారం, ఆధారం లేకుండా కేవలం జిహుయ్‌ రెండోసారి పరీక్షకు వెళుతోంది కాబట్టి ఏదో జరిగి ఉంటుందనే అంచనాలపై ఆధారపడి ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చినట్లు తర్వాత తేలింది. పోటీ ముగియగానే తీసుకున్న ‘శాంపిల్‌’పై అనుమానం ఉండటం వల్లే స్పష్టత కోసం రెండో ‘శాంపిల్‌’ తీసుకుంటున్నారని వినిపించినా... దానిపై కూడా అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. రోజూ ఐఓసీ నిర్వహించే సుమారు 5000 డోపింగ్‌ పరీక్షల్లో ఇది కూడా ఒక రొటీన్‌ పరీక్ష కూడా కావచ్చు!   

మరిన్ని వార్తలు