ఇటలీ అథ్లెట్‌  స్ప్రింట్‌ చాంపియన్‌

2 Aug, 2021 03:40 IST|Sakshi

100 మీటర్ల పరుగు విజేత జాకబ్స్‌

ఫైనల్‌కే  చేరని జమైకన్లు

బ్రోమెల్‌ సెమీస్‌తోనే సరి

‘జమైకన్‌ థండర్‌’ బోల్ట్‌ లేని ఒలింపిక్స్‌లో ఎవరా పందెం కోడి అనే చర్చకు ఆదివారం తెరపడింది. టోక్యో ఒలింపిక్స్‌లో అనూహ్యంగా ఇటలీ స్ప్రింటర్‌ మార్సెల్‌ జాకబ్స్‌ దూసుకొచ్చాడు. ఎవరి ఊహకందని విధంగా 1992 తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌ పురుషుల 100 మీటర్ల రేసులో యూరోపియన్‌ అథ్లెట్‌ విజేతగా నిలిచాడు. చిత్రంగా జమైకన్‌ అథ్లెట్లు ఎవరూ ఫైనల్స్‌కే అర్హత సాధించలేకపోయారు.

టోక్యో: ఒలింపిక్స్‌లో కొన్నేళ్లుగా స్ప్రింట్‌ను శాసిస్తున్న జమైకాకు టోక్యోలో చుక్కెదురైంది. 100 మీటర్ల విభాగంలో బోల్ట్‌ వారసుడు బ్రోమెల్‌... బ్రోమెల్‌... అనే ప్రచారం చివరకు ప్రదర్శనకు వచ్చేసరికి తుస్సుమంది. పురుషుల ఈవెంట్‌లో ఎవరూహించని విజేత 100 మీటర్ల చిరుత అయ్యాడు. ఇటలీకి చెందిన మార్సెల్‌ జాకబ్స్‌ సరికొత్త చాంపియన్‌గా అవతరిం చాడు. ఆదివారం జరిగిన పురుషుల వంద మీటర్ల పరుగులో జాకబ్స్‌ పోటీని అందరికంటే ముందుగా 9.80 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అమెరికన్‌ ఫ్రెడ్‌ కెర్లీ 9.84 సెకన్ల టైమింగ్‌తో రజతం... కెనడాకు చెందిన అండ్రీ డి గ్రేస్‌ (9.89 సెకన్లు) కాంస్యం గెలిచారు. నిజానికి గత ఒలింపిక్స్‌ ముగిసే సమయానికి అసలు జాకబ్స్‌ పూర్తిస్థాయి స్ప్రింటరే కాదు. లాంగ్‌జంప్‌లో పోటీపడే ఈ ఇటాలియన్‌ గత రెండేళ్లుగా షార్ట్‌ డిస్టెన్స్‌ రన్‌పై కన్నేశాడు. అదేపనిగా ప్రాక్టీస్‌ చేశాడు. చివరకు ఇక్కడికొచ్చి స్వర్ణమే సాధించాడు. జమైకా కంటే ముందు ఏళ్ల తరబడి అమెరికన్ల గుప్పిట ఉన్న స్ప్రింట్‌ ‘బీజింగ్‌’లో జమైకా చేతుల్లోకి వెళ్లింది. తీరా టోక్యోకు వచ్చేసరికి అసలు ఒక్క జమైకన్‌ అథ్లెట్‌ లేకుండానే ఫైనల్‌ జరగడం మరో విశేషం. జమైకాలో బోల్ట్‌ తర్వాత అంతటివాడుగా పేరొందిన యోహాన్‌ బ్లేక్‌ సెమీస్‌తోనే సరిపెట్టుకున్నాడు. అతని సహచరుడు ఒబ్లిక్‌ సెవిల్లే కూడా అక్కడితోనే ఆగిపోయాడు. అందరి దృష్టిని ఆకర్షించి, వంద మీటర్ల పరుగులో అమెరికా ఆశాకిరణమైన బ్రోమెల్‌ అసలు పతకం బరిలోనే లేడు. ఈ అ‘మెరిక’ పని రెండో సెమీస్‌లోనే కంచికి చేరింది.

మరిన్ని వార్తలు