Umran Malik: టీమిండియాలో ఉమ్రాన్.. జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఆసక్తికర ట్వీట్‌

23 May, 2022 14:19 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 18 సభ్యుల టీమిండియాను ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో ఐపీఎల్‌ 2022 స్పీడ్‌ సెన్సేషన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌, పంజాబ్‌ యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ తొలిసారి చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో వేగంతో పాటు వికెట్లు కూడా సాధించి ఐదో అత్యధిక వికెట్‌ టేకర్‌గా (14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు) నిలిచిన ఉమ్రాన్‌ను దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయాలని భారీ స్థాయిలో డిమాండ్లు వినిపించిన నేపథ్యంలో సెలెక్టర్లు కశ్మీరీ పేసర్‌కు అవకాశానిచ్చారు. ఈ సీజన్‌లో నిలకడైన పేస్‌తో బుల్లెట్లలాంటి బంతుల్ని సంధించిన ఉమ్రాన్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని (157 కిమీ) విసిరి రికార్డు సృష్టించాడు. 


ఇదిలా ఉంటే, ఉమ్రాన్‌ మాలిక్‌ టీమిండియాకు ఎంపిక అయిన నేపథ్యంలో అతని సొంత రాష్ట్రపు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించాడు.  తొలిసారి టీమిండియాకు ఎంపికైన ఉమ్రాన్‌కి అభినందనలు తెలిపిన అబ్దుల్లా.. సన్‌రైజర్స్‌ స్పీడ్‌ గన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలో ప్రారంభమయే దక్షిణాఫ్రికా సిరీస్‌ను చాలా ఆసక్తిగా అనుసరిస్తామని ట్విటర్‌ వేదికగా తన సందేశాన్ని పంపాడు. కాగా, ప్రొటీస్‌తో సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చి ఉమ్రాన్‌, అర్ష్‌దీప్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సఫారీలతో టీ20 సిరీస్ జూన్ 9 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. 
చదవండి: Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు! జరిగేది ఇదే!

మరిన్ని వార్తలు