బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పోవడంపై నోరు విప్పిన గంగూలీ

13 Oct, 2022 17:31 IST|Sakshi

బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్‌ గంగూలీ.. పదవి కోల్పోవడంపై తొలిసారి నోరు విప్పాడు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన దాదా ఈ విషయంపై స్పందిస్తూ.. ఆటగాడిగా, అడ్మినిస్ట్రేటర్‌గా జీవిత కాలం కొనసాగడం కుదురదని, ఏదో ఒక రోజు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందేనని వైరాగ్యంతో నిండిన మాటలు మాట్లాడాడు. ఆటగాడిగా, బోర్డు అధ్యక్షుడిగా నాణెం రెండు కోణాలు చూడటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. 

భవిష్యత్తులో ఇంతకంటే అత్యున్నత పదవి చేపట్టేందుకు ప్రయత్నిస్తానని, ఐసీసీ అధ్యక్ష పదవిపై తన మనసులో మాటను పరోక్షంగా బయటపెట్టాడు. టీమిండియా కెప్టెన్‌గా, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) అధ్యక్షుడిగా, బీసీసీఐ బాస్‌గా భారత క్రికెట్‌కు సంబంధించి అత్యున్నత పదవులన్నీ అనుభవించానని, భవిష్యత్తు మరింత పెద్దదిగా ఉండేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. అంతిమంగా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు సంతృప్తినిచ్చాయని, తన హయాంలో భారత క్రికెట్‌ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేశానని తెలిపాడు. 

కాగా, బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా కొనసాగేందుకు బోర్డు పెద్దలు అంగీకరించకపోవడంతో దాదా అయిష్టంగానే పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అతని తదుపరి బీసీసీఐ బాస్‌గా రోజర్‌ బిన్నీ ఎన్నిక లాంఛనమేనని సమాచారం.

ఇదిలా ఉంటే, గంగూలీ బీసీసీఐ దాదాగిరి కోల్పోవడంలో తన అనుంగ అనుచరుడు జై షా పాత్ర ఉందని దాదా అభిమానులు బహిరంగంగా ఆరోపణలకు దిగుతున్నారు. జై షా పక్కనే ఉండి దాదాకు వెన్నుపోటు పొడిచాడని అంటున్నారు. బీజేపీలో చేరలేదన్న కసితో దాదాపై కక్ష సాధించారని గుసగుసలాడుకుంటున్నారు. ఇంకొందరైతే కోహ్లి ఉసురు తగిలి ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు.  
 
 

మరిన్ని వార్తలు