‘అది జరగకపోతే నా పేరు మార్చుకుంటా’

6 Aug, 2020 18:04 IST|Sakshi

ఒక్క కరోనా కేసు వచ్చినా ఐపీఎల్‌ కంచికే

ఇదే అత్యుత్తమ సీజన్‌గా నిలవడం ఖాయం

ఐపీఎల్‌-13 నిర్వహణపై నెస్‌ వాడియా

న్యూఢిల్లీ:  ఈ సీజన్‌ ఐపీఎల్‌పై అత్యంత ధీమాగా ఉన్నారు కింగ్స్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా. యూఏఈ వేదికగా జరిగే ఈ సీజన్‌ ఐపీఎల్‌ అత్యుత్తమ సీజన్‌గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ సీజన్‌ ఐపీఎల్‌ను ఎక్కువ మంది వీక్షించకపోతే తాను పేరు మార్చుకోవడానికి వెనుకాడనన్నారు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో తప్పుకోవడానికి ముందే నెస్‌ వాడియా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌కు స్పాన్సర్‌ నుంచి ఎవరైతే తప్పుకుంటారో వారు తర్వాత తప్పకుండా బాధపడతారన్నారు. (ఐపీఎల్‌ కొత్త టైటిల్‌ స్పాన్సర్‌ ఎవరు?)

ఐపీఎల్‌ సక్సెస్‌ కాదనే ఉద్దేశంతోనే కొన్ని కంపెనీలు వెనుకంజ వేస్తున్న క్రమంలో వాడియా స్పందించారు. ‘ ఐపీఎల్‌ నుంచి ఏ కంపెనీ తప్పుకున్నా వారు తర్వాత బాధపడతారు. ఎందుకు ఈ సీజన్‌ ఐపీఎల్‌లో భాగం కాలేదని పశ్చాత్తాపం చెందుతారు. ఇది అత్యుత్తమ సీజన్‌గా నిలవడం ఖాయం. నేను ఒక స్పాన్సర్‌గా ఉంటే కచ్చితంగా ముందుకెళ్లేవాడిని’ అని వాడియా తెలిపారు. ఒక ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించడంపైనే బీసీసీఐతో ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయన్నాడు. ఒకవేళ ఒక్క కరోనా కేసు వచ్చినా ఐపీఎల్‌ కథ కంచికే వెళుతుందన్నాడు. ఇప్పుడున్న తమ ముందన్న లక్ష్యం స్పాన్సర్‌లు కాదని, కరోనా పాజిటివ్‌ కేసులు లేకుండా నిర్వహించడమేనన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో కరోనా వైరస్‌ గురించి మాట్లాడకుండా స్పాన్సర్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చైనా కంపెనీ వివో తప్పుకున్నా ఆ ప్లేస్‌ను భర్తీ చేయడానికి చాలా కంపెనీలు వస్తాయన్నారు. ఇక వివో ఇప్పుడు తప్పుకుంటే ఆ కంపెనీతతో బీసీసీఐ జత కట్టే పరిస్థితులు ఉండకపోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు