Naomi Osaka: ఫ్రెంచ్​ టోర్నీలో ఊహించని ట్విస్ట్​​!

2 Jun, 2021 05:16 IST|Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న నయోమి ఒసాకా

మానసికంగా ఆందోళనకు లోనవుతున్నానని ప్రకటన

మైదానం నుంచి విరామం కావాలన్న రెండో ర్యాంకర్‌   

‘మీడియా సమావేశాల్లో పాల్గొనను. ఈ నిర్ణయం కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధం’... ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆరంభానికి ముందు జపాన్‌ స్టార్‌ నయోమి ఒసాకా చేసిన ప్రకటన ఇది. వారం రోజులు కూడా గడవక ముందే ఆమె అంచనా నిజమైంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులు భారీ జరిమానా వేసి కఠినంగా వ్యవహరించగా... తాను కూడా వెనక్కి తగ్గనంటూ ఒసాకా కఠిన నిర్ణయం తీసుకుంది. మున్ముందు తనపై చర్యలు తీసుకునే అవకాశం ఎలాగూ ఉండటంతో టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.  మీడియా కారణంగా మానసికంగా ఆందోళనకు లోనవుతున్న తన దృష్టిలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ లెక్క కాదన్నట్లుగా ఆమె వ్యవహరించింది.

పారిస్‌: నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్‌ నయోమి ఒసాకా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆట నుంచి విరామం కోరుకుంటున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్‌లో విజయం సాధించిన ఒసాకా... బుధవారం జరిగే రెండో రౌండ్‌లో రొమేనియాకు చెందిన  అనా బొగ్డన్‌తో తలపడాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందే ఆమె క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌కు గుడ్‌బై చెప్పేసింది. తాను తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ ఒసాకా ట్విటర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది.

23 ఏళ్ల ఒసాకా తన కెరీర్‌లో మొత్తం ఏడు సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించగా... అందులో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉండటం విశేషం. 2018లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఓడించి యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాకా 2019, 2021లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను... 2020లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఒసాకా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకోవడం దురదృష్టకరమని, వచ్చే ఏడాది ఆమె ఈ టోర్నీలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించిన ఫ్రెంచ్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ గైల్స్‌ మోరెటాన్‌... ఆటగాళ్ల ఆరోగ్యం, మంచీ చెడూ చూసుకునే బాధ్యతను తాము ఎప్పుడూ విస్మరించలేదని స్పష్టం చేశారు.  

నేపథ్యమిదీ... 
మీడియా సమావేశాల్లో విలేకరులు అర్థం పర్థం లేని ప్రశ్నలు, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి తమను ఇబ్బంది పెడుతుంటారని... పలు సందర్భాల్లో ఆటగాళ్లను బాధపెట్టడమే లక్ష్యంగా ఇలా చేస్తుంటారని ఆరోపిస్తూ ఒసాకా రాబోయే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జరిగే  మీడియా సమావేశాల్లో పాల్గొననని టోర్నీకి ముందు ప్రకటించింది. ఓడినప్పుడైతే తమ మానసిక స్థితిని పట్టించుకోకుండా విలేకరులు వేధిస్తారంటూ వ్యాఖ్యానించిన ఆమె... తాను ఇవన్నీ తట్టుకోలేనంటూ చెప్పింది.

అయితే గ్రాండ్‌స్లామ్‌ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు కచ్చితంగా మీడియా సమావేశానికి హాజరు కావాల్సిందే. ఊహించినట్లుగానే  తొలి రౌండ్‌ విజయం తర్వాత ఒసాకా తన మాటపై నిలబడటంతో నిర్వాహకులు ఆమెపై 15 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. దీంతో పాటు అవసరమైతే గ్రాండ్‌స్లామ్‌లలో ఆడకుండా నిషేధం కూడా విధిస్తామంటూ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల నిర్వాహకులు హెచ్చరించారు కూడా. ఇలాంటి స్థితిలో టోర్నీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడమే సరైందిగా ఆమె భావించింది.

మీడియా గురించి కొద్ది రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు ఇలాంటి స్థితి వస్తుందని ఊహించలేదు. అయితే నాపై అనవసర దృష్టి పడుతున్న కారణంగా అందరి మేలు కోరి టోర్నీ నుంచి తప్పుకోవడమే సరైనదిగా భావిస్తున్నా. ఇది తగిన సమయం కాదని తెలిసినా తప్పడం లేదు. నా దృష్టిలో మానసిక ఆరోగ్య సమస్య చిన్నదేమీ కాదు. నిజం చెప్పాలంటే 2018లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన నాటి నుంచే మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ వస్తున్నాను. నేను పెద్దగా కలుపుగోలు మనిషిని కాదని నా సన్నిహితులందరికీ తెలుసు. జనంలో ఉన్నప్పుడు ఆందోళనను తగ్గించుకునే క్రమంలోనే ఎక్కువ సమయం హెడ్‌ ఫోన్‌లు ధరిస్తూ ఉంటాను కూడా. నిజానికి టెన్నిస్‌ మీడియా నన్ను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోయినా, మీడియా సమావేశానికి రాగానే తీవ్రంగా ఆందోళనకు లోనవుతూ ఉంటాను.

పారిస్‌లో ఇప్పటికే పరిస్థితి నన్ను మరీ భయపెట్టేలా ఉంది. అందుకే నా మేలు కోసం మీడియాకు దూరంగా ఉండాలని భావించా. ఇక్కడ ఉన్న కొన్ని పాతకాలపు నిబంధనలను అందరి దృష్టికీ తీసుకురావాలని ప్రయత్నించా.  నిర్వాహకులకు క్షమాపణ చెబుతూ టోర్నీ ముగిసిన తర్వాత మాట్లాడతా అని కూడా విడిగా చెప్పా. ప్రస్తుతానికి మైదానం నుంచి విరామం తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఏమేం చేయవచ్చో నేనూ చర్చిస్తా. 
    –నయోమి ఒసాకా 

చదవండి: ర్యాప్​ అండ్​ లవ్​స్టోరీ

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు