T20 World Cup 2022: ప్రారంభానికి ముందే టి20 ప్రపంచకప్‌ 2022 కొత్త చరిత్ర

15 Sep, 2022 11:42 IST|Sakshi

ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టి20 ప్రపంచకప్‌ 2022 టోర్నీ ప్రారంభానికి ముందే సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఒక్క నెలలో జరగనున్న మ్యాచ్‌లకు కలిపి దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ఐసీసీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. 82 దేశాల నుంచి అభిమానులు ఈ టికెట్లు కొనుగోలు చేశారని.. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొననుండగా.. ఈసారి అన్ని స్టేడియాలు ఫుల్‌ అయ్యేలా కనిపిస్తుందంటూ పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియాలో అతిపెద్ద గ్రౌండ్‌ అయిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ) కెపాసిటీ 86,174 కాగా.. అన్ని సీట్లు ఫుల్‌ అయ్యాయని ఐసీసీ తెలిపింది. 

ఈ టికెట్స్‌లో 85వేల టికెట్లు ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం ఉన్నాయి. చిన్నపిల్లలకు సంబంధించిన టికెట్‌ రేటును ఐదు ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా.. పెద్దవాళ్లకు 20 ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా నిర్థారించారు. ఈ టికెట్స్‌ అన్ని కేవలం ఫస్ట్‌ రౌండ్‌, సూపర్‌-12 మ్యాచ్‌లకు సంబంధించినవి మాత్రమే. ఇంకా సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల టికెట్లు విడుదల చేయాల్సి ఉంది. 

ఇక టి20 ప్రపంచకప్‌లో అక్టోబర్‌ 23న చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్తాన్‌ తలపడనున్న మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్మడయ్యాయి. కాగా మ్యాచ్‌కు ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో స్టాండింగ్‌ టికెట్స్‌ అందుబాటులో ఉంచగా.. అవి కూడా అమ్ముడుపోవడం విశేషం. వీటితో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లకు కూడా టికెట్లు అయిపోయాయి.

ఐసీసీ ఈవెంట్స్‌ హెడ్‌ క్రిస్‌ టెట్లీ మాట్లాడుతూ.. '' టి20 ప్రపంచకప్‌ 2022కు అభిమానుల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. ఇప్పటికే దాదాపు 5 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.  ప్రపంచకప్‌కు ఇంకా నెల సమయం ఉన్నప్పటికి అభిమానులు లైవ్‌లో మ్యాచ్‌లు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెబ్‌సైట్‌లో మరికొన్ని టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. వీలైనంత తొందరగా అవికూడా అందుబాటులో ఉంచుతాము. అని చెప్పాడు.

ఇక అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు టి20 ప్రపంచకప్‌  జరగనుంది. అక్టోబర్‌ 16 నుంచి 23 వరకు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూఫ్‌-ఏలో శ్రీలంక, నమీబియా, ఊఏఈ, నెదర్లాండ్స్‌ పోటీ పడుతుండగా.. గ్రూఫ్‌-బిలో వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, జింబాబ్వేలు ఉన్నాయి. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సూపర్‌-12 దశకు చేరుకుంటాయి.

ఇక సూపర్‌-12 దశలో  గ్రూఫ్‌-1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, అఫ్గానిస్తాన్‌తో పాటు ఎ1, బి2 క్వాలిఫై జట్లు ఉండగా.. గ్రూప్‌-2లో టీమిండియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు బి1, ఏ2 క్వాలిఫయింగ్‌ జట్లు ఉండనున్నాయి. 

చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా సీనియర్‌ గుడ్‌బై

'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'‌.. ఎంతైనా పాక్‌ క్రికెటర్‌!

మరిన్ని వార్తలు