ఇంత ఖర్చుతో ఐపీఎల్‌ అవసరమా?: రాజస్థాన్‌ ఆటగాడు

27 Apr, 2021 06:59 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న తరుణంలో ఐపీఎల్‌ కోసం ఫ్రాంచైజీలు, ప్రభుత్వాలు, కంపెనీలు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాయని, ఇది సమంజసమేనా? అని ఐపీఎల్‌ను వీడిన ఆసీస్‌ ఆటగాడు ఆండ్రూ టై ప్రశ్నించాడు. ఆసుపత్రుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్‌-2021 సీజన్‌ను కొనసాగించడం తనకు ఆమోదయోగ్యంగా అనిపించలేదన్నాడు.  

అయితే ఈ మెగా టోర్నీ నిర్వహణ విషయంలో ఇతరుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, కానీ అందరూ ఒకేలా ఆలోచిస్తారని మాత్రం అనుకోవడం లేదన్నాడు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ ఆండ్రూ టై లీగ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతనితో పాటు మరో ఇద్దరు ఆసీస్ ప్లేయర్స్ ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ కూడా ఇంటిదారి పట్టారు.

క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రూ టై ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఆటగాళ్ల భద్రతా కోణంలో ప్రస్తుతానికి మేమంతా సేఫ్‌‌గానే ఉన్నాం. ఇది ఇలానే కొనసాగుతుందా? అలాగే భారత్‌లో రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరకని కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు, కంపెనీలు, ప్రభుత్వాలు వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తున్నాయి.?, మేము ఐపీఎల్‌ ఆడటం సరైనదేనా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

అందుకనే తాను ఐపీఎల్‌ను వీడినట్లు టై తెలిపాడు. క్రీడలతో ఎంటర్‌టైన్‌మెంట్‌ లభిస్తుందని తనకు తెలుసని, ముఖ్యంగా ఈ కఠిన పరిస్థితుల్లో ప్రజలకు అదెంతో మేలు చేస్తుందనే కోణంలో ఐపీఎల్‌ను కొససాగిస్తూ ఉండవచ్చని, కానీ అంతా ఇదే అభిప్రాయంతో ఉంటారని తాను అనుకోవడం లేదని టై పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు