రైనా ఎగ్జిట్‌కు ప్రధాన కారణం అదేనా?

2 Sep, 2020 11:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆటగాళ్లపై ఇప్పుడున్న ఒత్తిడి సాధారణమైంది కాదని... టెస్టులు, ఐసోలేషన్, బుడగలోపలే అడుగులు అనేవి అందరూ భరించలేరని ఆటగాళ్ల మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్‌ స్పష్టం చేశారు. ఆయన గతంలో టీమిండియాకు సేవలందించారు. ‘చెప్పాలంటే సురేశ్‌ రైనాలాంటి ఆటగాళ్లు ఒక్క చెన్నైలోనే లేరు! ఎనిమిది ఫ్రాంచైజీల్లోనూ ఉన్నారు. స్టార్‌ క్రికెటర్, రాయల్‌ చాలెంజర్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలాంటి కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే ఈ అసాధారణ ఒత్తిడి తట్టుకొని నిలబడగలరు’ అని ప్యాడీ ఆప్టన్ విశ్లేషించారు. ఆటగాళ్లకు సహజసిద్ధమైన చోదక శక్తి ప్రేక్షకులేనని వాళ్లు కూడా లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఆడాల్సి రావడం కూడా సమస్య అని చెప్పారు. కాగా, దుబాయ్‌లో క్వారంటైన్‌లో ఉండగానే చెన్నై బృందాన్ని కరోనా వణికించింది.

దాంతోపాటు సురేశ్‌ రైనా మేనమామ కుంటుంబంపై ఓ దోపిడీ ముఠా దాడి చేసింది. ఈ దాడిలో ఆయన మేనమామ ఘటనా స్థలంలోనే మరణించాడు. ఆ మరుసటి రోజే రైనా స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. అయితే, రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడా! లేక దుబాయ్‌లో పరిస్థితులు నచ్చక ఈ నిర్ణయం తీసుకున్నాడా అనేది కొంత సందేహాస్పదం. కాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో గల రైనా బంధువుల ఇంటిపై ఆగస్ట్ 29న నలుగురు దుండగులు దాడి చేశారు. అర్థరాత్రి నిద్రిస్తున్నసమయంలో అకస్మాత్తుగా దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేశారు. ఇతర కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారు. కాగా ఈ ఘాతుకానికి పాల్పడింది ‘కాలే కచ్చే గ్యాంగ్‌’ అని తెలిసింది. 
(చదవండి: మా కుటుంబంపై దాడి చేసింది ఎవరు: రైనా)

మరిన్ని వార్తలు