Mohammad Wasim Jr: పరుగు కోసం రూల్స్‌ మరిచాడు.. పాక్ బ్యాటర్‌ తప్పిదం

28 Oct, 2022 22:01 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్‌పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ను ఇది వరుసగా రెండో ఓటమి కావడంతో సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఆఖర్లో మహ్మద్‌ వసీమ్‌ చేసిన తప్పిదం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

సాధారణంగా ఒక మ్యాచ్‌లో బౌలర్‌ బంతి విడిచేవరకు నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ క్రీజు దాటడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే బౌలర్‌కు మన్కడింగ్‌(రనౌట్‌) చేసే అవకాశం ఉంది. ఈ  మధ్యనే మన్కడింగ్‌ను చట్టబద్దం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికి కొంతమంది పనిగట్టుకొని అది క్రీడా స్పూర్తికి విరుద్ధం అని పేర్కొంటున్నారు.

ఈ విషయం పక్కనబెడితే.. బ్రాడ్‌ ఎవన్స్‌ వేసిన చివరి ఓవర్లో చివరి బంతికి రెండు పరుగులు చేస్తే పాక్‌ గెలుస్తుంది. ఎవన్స్‌ బంతి వేయడానికి ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మహమ్మద్ వాసిమ్ జూనియర్ చాలా ముందుకు వచ్చేశాడు. పరుగు తీయాలన్న తపనతో రూల్స్‌ మరిచిపోయాడు. ఇక్కడ ఎవన్స్‌కు మన్కడింగ్‌ చేసే అవకాశం ఉన్నప్పటికి చేయలేదు. అయితే తెలివిగా ప్రవర్తించిన సికందర్ రజా కీపర్‌కు త్రో విసిరాడు. దాన్ని అందుకున్న జంబాబ్వే కీపర్ వికెట్లను పడగొట్టడంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం అందుకుంది.

బౌలర్ బంతిని వదలడానికి ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే రనౌట్ చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై పలువురు క్రికెట్ ఎక్స్‌పర్ట్‌లు, మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్‌లో మహమ్మద్ వాసిం జూనియర్ చేసిన పనికి అలాంటి నిబంధనలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశాడు. బాల్ డెలివర్ చేయడానికి ముందే బ్యాటర్ క్రీజు దాటకుండా కఠిన నిబంధనలు తీసుకురావలసిన కారణం ఇదే. రాత్రి జరిగిన మ్యాచ్ చివరి బంతి చూడండి’ అని హాగ్ ఆ సంఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు

ఈ అంశంపై క్రికెట్ అనలిస్ట్ పీటర్ డెల్లా పెన్నా స్పందించాడు ‘బంతి డెలివరీకి ముందు బౌలర్ గాల్లోకి ఎగరడానికి ముందే వాసిం క్రీజు దాటేశాడు. డెలివరీ సమయానికి చాలా ముందుకు వెళ్లిపోయాడు. ఒక్కసారి ఊహించండి.. దీని వల్ల పాకిస్తాన్ జట్టు రెండో పరుగు కూడా పూర్తి చేసి ఉంటే? అతన్ని అవుట్ చేసే అవకాశం ఉన్నా కూడా సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చేది ’ అంటూ ట్వీట్ చేశాడు.  పీటర్‌ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు ఇలాంటి ఆటగాళ్లను మన్కడింగ్‌(రనౌట్‌) చేసినా తప్పు కాదని పేర్కొన్నారు.

చదవండి:  'కొంచెం హుందాగా ప్రవర్తించండి'.. సెహ్వాగ్‌, పార్థివ్‌లకు చురకలు

మరిన్ని వార్తలు