Azam Khan: ఆఫ్గన్‌ ఆటగాడిపై గుడ్లు ఉరిమి చూశాడు.. ఎవరీ క్రికెటర్‌?

28 Mar, 2023 11:28 IST|Sakshi

పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి టి20 పాకిస్తాన్‌ గెలిచినప్పటికి తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గిన ఆఫ్గన్‌ తొలిసారి పాక్‌పై సిరీస్‌ విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. ఆఫ్గన్‌ విజయంలో సీనియర్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ కీలకపాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

అయితే మూడో టి20 సందర్భంగా మహ్మద్‌ నబీని పాకిస్తాన్‌ క్రికెటర​ ఒకరు గుడ్డు ఉరిమి చూశాడు. అతని చూపు చూస్తే..  కోపంతో రగిలిపోతూ అవకాశం వస్తే తినేస్తా అన్నట్లుగా ఉంది. మరి ఇంతకీ నబీవైపు కోపంగా చూసిన ఆ క్రికెటర్‌ ఎవరో తెలుసా.. అజమ్‌ ఖాన్‌. సొంత క్రికెటర్ల చేత బాడీ షేమింగ్‌ అవమానాలు ఎదుర్కొన్నది ఇతనే. అంతేకాదు మాజీ క్రికెటర్‌ మొయిన్‌ ఖాన్‌ కొడుకు కూడా.

జట్టుతో పాటే ఉన్నప్పటికి ఆఫ్గన్‌తో టి20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. అయితే రెండో టి20లో మాత్రం రెగ్యులర్‌ కీపర్‌ మహ్మద్‌ హారిస్‌ స్థానంలో అజమ్‌ ఖాన్‌ కొంతసేపు వికెట్‌ కీపింగ్‌ చేశాడు. ఆ మ్యాచ్‌లో నబీ కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు. ఈ సందర్భంగా నబీవైపు అజమ్‌ ఖాన్‌ కోపంగా చూడడం గమనించిన కెమెరామెన్‌ క్లిక్‌ మనిపించాడు. కాగా అజమ్‌ ఖాన్‌ పాకిస్తాన్‌ తరపున మూడు టి20 మ్యాచ్‌లు ఆడాడు.

ఇక సోమవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 66 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీమ్‌ అయూబ్‌ 49 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షాదాబ్‌ ఖాన్‌ 28 పరుగులు చేశాడు. అనంరతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్‌ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్‌ అయింది. అజ్మతుల్లా ఒమర్‌జెయ్‌ 21 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌, ఇషానుల్లా చెరో మూడు వికెట్లు తీయగా.. జమాన్‌ ఖాన్‌, ఇమాద్‌ వసీమ్‌, మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

చదవండి: 'నా దృష్టిలో కోహ్లినే బెటర్‌.. ఎందుకంటే?'

చివరి టి20లో ఓడినా ఆఫ్గన్‌ది చరిత్రే

మరిన్ని వార్తలు