Hasan Ali: హద్దు మీరితే ఇలాగే ఉంటుంది.. సహనం కోల్పోయిన పాక్‌ క్రికెటర్‌

6 Dec, 2022 10:34 IST|Sakshi

పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ సహనం కోల్పోయాడు. తనను హేళన చేసిన కొంతమంది అభిమానులతో బహిరంగ గొడవకు దిగాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ఫామ్‌ కోల్పోయిన జట్టుకు దూరమైన హసన్‌ అలీ ఒక లోకల్‌ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. పంజాబ్‌ ఫ్రావిన్స్‌లోని పక్‌పత్తన్‌ జిల్లాలో ఆదివారం ఈ మ్యాచ్‌ జరిగింది.

కాగా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో హసన్‌ అలీ బౌండరీ లైన్‌ వద్ద నిల్చున్నాడు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు హసన్‌ అలీని టీచ్‌ చేశారు. జట్టులో చోటు కోల్పోయి గల్లీ క్రికెట్‌ ఆడడానికి సిగ్గులేదా.. అంటూ ఆటపట్టించారు. చాలాసేపు ఓపికతో భరించిన హసన్‌ అలీపై కొంతమంది గడ్డి, పేపర్లను విసిరారు. దీంతో సహనం కోల్పో​యిన హసన్‌ అలీ తనను టీచ్‌ చేసిన వారితో గొడవకు దిగాడు. వారిని కొట్టడానికి ప్రయత్నించగా మిగతావారు హసన్‌ అలీని అడ్డుకున్నారు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు వచ్చి హసన్‌ అలీని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.

ఒక లోకల్‌ మ్యాచ్‌లో ఆడేందుకు ఒప్పుకున్న అంతర్జాతీయ క్రికెటర్‌ను ఇలానే అవమానిస్తారా అంటూ మ్యాచ్‌ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హసన్‌ అలీతో గొడవకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. కాగా 2021 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో హసన్‌ అలీ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటినుంచి హసన్‌ అలీని ట్రోల్‌ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఫామ్‌ కోల్పోయిన అతను జట్టుకే దూరమయ్యాడు. దీంతో అభిమానుల ట్రోల్స్‌ తారాస్థాయికి చేరుకున్నాయి.

మంచిగా ఉన్నంతవరకు ఏం కాదు కానీ ఆటగాళ్లు రివర్స్‌ అయితే మాత్రం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని హసన్‌ అలీ ఉదంతం హెచ్చరిస్తుందంటూ కొంతమంది పేర్కొన్నారు.  ఒకప్పుడు హసన్‌ అలీ పాక్‌ తరపున నెంబర్‌వన్‌ బౌలర్‌గా రాణించాడు. ఆ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ నెంబర్‌వన్‌గా కొంతకాలం కొనసాగాడు. ఇక పాకిస్తాన్‌ తరపున హసన్‌ అలీ 60 వన్డేల్లో 91 వికెట్లు, 21 టెస్టుల్లో 77 వికెట్లు, 50 టి20ల్లో 60 వికెట్లు తీశాడు. 

చదవండి: FIFA WC: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం!

ENG Vs PAK: ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్‌ కోసం చకోర పక్షుల్లా

మరిన్ని వార్తలు