పాక్‌ పరువు తీసిన ఆ దేశ మాజీ క్రికటర్‌

25 Jul, 2021 16:21 IST|Sakshi

కరాచీ: ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ నుంచి కేవలం 10 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొనడంపై ఆ దేశ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్ నజీర్ ఫైరయ్యాడు. విశ్వ వేదికపై పాక్‌ దుస్థితికి కారణమైన పాలకులను ఎండగడుతూ.. ట్వీటర్‌ వేదికగా ధ్వజమెత్తాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ల ఫోటోను ప్రస్తుత ఒలింపిక్స్‌ పాల్గొన్న అథ్లెట్ల ఫొటోను ఒకే ఫ్రేమ్‌లో చేరుస్తూ.. ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 22 కోట్ల జనాభా గల దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనేది కేవలం 10 మంది ఆటగాళ్లేనా అంటూ పాక్‌ పాలకులపై మండిపడ్డాడు. విశ్వక్రీడల్లో పాక్‌ ఈ స్థాయికి దిగజారడానికి బాధ్యులైన ప్రతిఒక్కరికీ ఇది సిగ్గుచేటని పాక్‌ పాలకులను ఉద్దేశిస్తూ చురకలంటించాడు. 

పాక్‌లో ప్రతిభకు కొదవలేదని, అయితే క్రీడల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే బాధ్యతగల నాయకులే లేరని విమర్శించాడు. దేశంలోని చాలా మంది ప్రముఖులు క్రీడా సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారు కానీ, ఎంతమంది ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రశ్నించాడు. ఆర్థిక సహకారం అవసరం ఉన్న అథ్లెట్ల వివరాలిస్తే.. ఎంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారని నిలదీశాడు. తమ దేశ దుస్థితికి పాలకులతో పాటు బాధ్యత గల ప్రముఖులు కూడా కారణమని పాక్‌ పరువును బజారుకు ఈడ్చాడు. 

కాగా, 2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ తరఫున 21 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌కు అత్యధికంగా పాక్‌ తరఫున 62 మంది అర్హత సాధించారు. పాక్‌ ఖాతాలో ఇప్పటి వరకు 10 పతకాలు ఉన్నాయి. ఇందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలున్నాయి. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత పాక్‌ ఒక్క పతకం కూడా గెలవలేదు. ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న పాక్‌ పురుషుల హాకీ జట్టు సాధించిన కాంస్యమే పాక్ ముద్దాడిన చిట్టచివరి ఒలింపిక్‌ పతకం. దాదాపు 30 సంవత్సరాలుగా పాక్ పతకం గెలవలేదు. ఈసారి కూడా ఆశలు లేవు.  

కాగా, 1999-2012 మధ్య పాక్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇమ్రాన్‌ నాజీర్‌.. హార్డ్‌ హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో 14 బంతుల్లో అర్ధ శతకం సాధించిన రికార్డు అతని పేరిట ఉంది. పాక్ తరఫున అతను 8 టెస్టులు, 79 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. టెస్టులో 427, వన్డేల్లో 1895, టీ20ల్లో 500 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 4 సెంచరీలు, 13 అర్ధ శతకాలు చేశాడు.

మరిన్ని వార్తలు