పాక్‌ సీనియర్‌ ఆటగాళ్లపై వేటు

20 Oct, 2020 06:13 IST|Sakshi

సర్ఫరాజ్, మాలిక్, అమీర్‌లకు దక్కని చోటు

జింబాబ్వేతో సిరీస్‌కు ప్రాబబుల్స్‌ ప్రకటన

కరాచీ: కొంత కాలంగా పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా తయారైన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథులు షోయబ్‌ మాలిక్, సర్ఫరాజ్‌ అహ్మద్‌లతోపాటు పేసర్‌ మొహ్మమ్మద్‌ అమీర్‌పై వేటు పడింది. జింబాబ్వేతో ఆరంభమయ్యే వన్డే, టి20 సిరీస్‌ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్‌ జట్టులో వీరికి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చోటు కల్పించలేదు. అయితే ఇటీవల ముగిసిన దేశవాళీ టి20 లీగ్‌ నేషనల్‌ టి20 కప్‌లో రాణించిన సెంట్రల్‌ పంజాబ్‌ జట్టు యువ ఆటగాడు అబ్దుల్లా షఫీక్‌కు మొదటిసారి సీనియర్‌ జట్టులో స్థానం లభించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని పేస్‌ ద్వయం హసన్‌ అలీ, నసీమ్‌ షా పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. కెప్టెన్‌గా బాబర్‌ ఆజమ్‌ను నియమించిన పీసీబీ... వైస్‌ కెప్టెన్‌గా షాదాబ్‌ ఖాన్‌ను నియమించింది. పాక్, జింబాబ్వే మధ్య తొలి వన్డే ఈనెల 30న జరగనుండగా... నవంబర్‌ 1, 3వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం నవంబర్‌ 7, 8, 10వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి.

మా వీసాల అంశాన్ని ఐసీసీ చూస్తుంది
భారత్‌లో ఆడేందుకు తలెత్తే వీసా ఇబ్బందులను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చూసుకుంటుందని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో టి20 ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వీసాల బాధ్యత పూర్తిగా ఐసీసీదేనని పీసీబీ సీఈఓ వసీమ్‌ ఖాన్‌ తెలిపారు. ఐసీసీ ఈ అంశంపై తమకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే దేనికైనా నిర్దిష్ట గడువు అంటూ ఉండాలని వచ్చే జనవరిదాకా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు చెప్పారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమీప భవిష్యత్తులో ముఖాముఖి టోర్నీలు జరుగుతాయన్న ఆశలేవీ లేవని ఆయన చెప్పారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా