Babar Azam: పాక్‌ వీరోచిత పోరాటం.. డబుల్‌ మిస్‌ అయినా కోహ్లిని అధిగమించిన బాబర్‌ ఆజమ్‌

16 Mar, 2022 19:30 IST|Sakshi

PAK VS AUS 2nd Test: కరాచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య పాకిస్థాన్‌ అద్భుతమైన పోరాట పటిమను కనబర్చింది. 506 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రికార్డు స్థాయిలో పరుగులు (443/7) చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్ (305 బంతుల్లో 96; 6 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (425 బంతుల్లో 196; 21 ఫోర్లు, సిక్స్‌), వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (177 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్) వీరోచితంగా పోరాడి ప్రత్యర్ధి చేతుల్లో నుంచి విజయాన్ని లాగేసుకున్నారు.

ఓ దశలో (బాబర్‌, రిజ్వాన్‌ క్రీజ్‌లో ఉండగా) పాక్‌ చారిత్రక విజయం సాధిస్తుందని అంతా ఊహించారు. అయితే, బాబర్‌ ఔట్‌ కావడంతో పాక్‌ డిఫెన్స్‌లో పడి మ్యాచ్‌ చేజారకుండా కాపాడుకోగలిగింది. పాక్‌ సారథి కళాత్మక ఇన్నింగ్స్ ఆడగా, రిజ్వాన్‌ చివరి దాకా క్రీజ్‌లో నిలిచి ఆసీస్‌ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన పాక్‌ కెప్టెన్‌.. ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్లు డాన్‌ బ్రాడ్‌మన్‌ (173*), రికీ పాంటింగ్‌ (156), టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (141)లను అధిగమించాడు. ఇదిలా ఉంటే, ఆసీస్‌, పాక్‌ల మధ్య 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా కరాచీలో జరిగిన రెండో టెస్ట్‌లోనూ అదే ఫలితం రిపీటైంది. ఈ నేపథ్యంలో ఈనెల 21 నుంచి 25 వరకు లాహోర్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌ ఇరు జట్లకు కీలకం కానుంది. 

రెండో టెస్ట్‌ స్కోరు బోర్డు :  
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 556/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ : 97/2 డిక్లేర్‌
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 148 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 443/7 
 

చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా యుజ్వేంద్ర చహల్..!
 

మరిన్ని వార్తలు