Pak Vs Aus: అభిమానులకు ద్రోహం చేశావు.. ఈ వయసులో నువ్వు కూడా: దుమ్మెత్తి పోసిన పాక్‌ మాజీ స్పిన్నర్‌

10 Mar, 2022 12:03 IST|Sakshi

Pakistan Vs Australia 1st Test: పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ దానిష్‌ కనేరియా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చైర్మన్‌ రమీజ్‌ రాజాపై మండిపడ్డాడు. పనికిమాలిన పిచ్‌ తయారు చేయించిందే గాక.. ఇంకా సమర్థించుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా సుదీర్ఘ కాలం తర్వాత మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా మార్చి 4-8 మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 

పేలవమైన ఈ పిచ్‌ ఒక్కసారి కూడా బౌలింగ్‌కు అనుకూలించకపోవడం గమనార్హం. ఫలితంగా బ్యాటర్లు చెలరేగారు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు చేయగా.. అజర్‌ అలీ, అబ్దుల్లా షఫిక్‌(136 నాటౌట్‌) చెరో శతకం బాదారు. ఆసీస్‌ ఆటగాళ్లలో ఓపెనర్‌ ఖావాజా 97, లబుషేన్‌ 90 పరుగులు చేశారు. 

ఈ క్రమంలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో పిచ్‌ రూపొందించిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రాజా.. మ్యాచ్‌ పేలవ డ్రాగా ముగియడాన్ని తాను స్వాగతించడం లేదని, నాణ్యమైన పిచ్‌లను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఇందుకు సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో కనేరియా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా రమీజ్‌ రాజా తీరుపై దుమ్మెత్తిపోశాడు. ‘‘రమీజ్‌ రాజా పాక్‌ అభిమానులకు ద్రోహం చేశాడు. వెన్నుపోటు పొడిచాడు. ఆయన తన కుమారుడి పెళ్లి పనులతో బిజీగా ఉన్నాడేమో! పర్లేదు! ఇప్పుడు మాత్రం ఈ జీవం లేని వికెట్‌ గురించి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చింది. కానీ.. మీరు.. ఇలంటి పిచ్‌ రూపొందించారు. 

బౌలర్లు రాణిస్తే చూడటం ఇష్టం లేదా? మీ కెప్టెన్‌ ఒక అసమర్థుడు. దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నాడు. ఇది ఎలాంటి పిచ్‌ అంటే రమీజ్‌ రాజా ఈ వయసులో కూడా అక్కడ పరుగుల వరద పారించగలడు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా బాబర్‌ ఆజం సారథ్యంలోని పాక్‌ ఆసీస్‌తో తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని డ్రాగా ముగించింది.

పాకిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా తొలి టెస్టు స్కోర్లు:
ఆస్ట్రేలియా- 459 ఆలౌట్‌
పాకిస్తాన్‌ 476/4 డిక్లేర్డ్‌ & 252/0 

చదవండి: IPL 2022- CSK: సీఎస్‌కే అభిమానులకు గుడ్‌న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

మరిన్ని వార్తలు