PAK vs AUS: ఏ ముహుర్తానా పాక్‌ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా

19 Mar, 2022 12:19 IST|Sakshi

ఆస్ట్రేలియా జట్టు ఏ ముహుర్తానా పాక్‌ గడ్డపై అడుగుపెట్టిందో కానీ.. అన్ని విచిత్ర పరిస్థితులే ఎదురవుతున్నాయి. 24 ఏళ్ల అనంతరం పాకిస్తాన్‌లో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 ఆడేందుకు ఆస్ట్రేలియా వచ్చింది. వచ్చీ రాగానే పెషావర్‌లో బాంబుల మోత.. తమను స్వాగతం పలికామా అన్నట్లుగా ఆస్ట్రేలియా జట్టును ఉలిక్కిపడేలా చేసింది. మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సుమారు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అప్పటికే పక్కనే ఉన్న రావల్పిండి సిటీలో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ మొదలైంది.

సిరీస్‌ రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వచ్చినప్పటికి.. పీసీబీ ఆసీస్‌ ఆటగాళ్ల భద్రత మాదేనని పేర్కొంది. అలా మొదటి టెస్టు పూర్తి కాగానే.. దేశంలో రాజకీయ సంక్షోభ దుమారం రేగింది. అధికారంలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా తమ పార్టీలు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

తాజాగా రాజకీయ సంక్షభం సెగ పాకిస్తాన్‌- ఆస్ట్రేలియా సిరీస్‌ను తాకింది. మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఏకైక టి20 మ్యాచ్‌ మార్చి 29, 31, ఏప్రిల్‌ 2, 4 తేదీలలో రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది. అయితే రాజకీయ సంక్షోభం కారణంగా పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు పక్కనే ఉన్న రావల్పిండిలో అల్లర్లు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రావల్పిండి నుంచి లాహోర్‌కు మ్యాచ్‌ వేదికలను మారుస్తున్నట్లు దేశ విదేశాంగ మంత్రి షేక్‌ రషీద్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. లాహోర్‌ వేదికగా అవే తేదీల్లో మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్‌ జరగనుందని ఆయన స్పష్టం చేశారు.

కాగా ఇప్పటికే మూడో టెస్టు కోసం ఇరుజట్లు లాహోర్‌లోని గడాఫీ వేదికగా ఆడనున్నాయి. ఇక సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు కూడా అక్కడే ఆడనున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే క్రికెట్‌ ఆస్ట్రేలియాకు తెలిపామని.. వారు తమ క్రికెటర్ల క్షేమ సమాచారాలు మాత్రమే అడిగారని.. సిరీస్‌ ముగిశాక జాగ్రత్తగా పంపించాలని కోరారని షేక్‌ రషీద్‌ తెలిపారు.

చదవండి: 'ఇప్పుడు కాదు రోహిత్‌.. ఆస్ట్రేలియాపై గెలిచి చూపించు'

Glenn Maxwell Marriage: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు

మరిన్ని వార్తలు