Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగేలా ఇంగ్లండ్‌ ప్రపంచ రికార్డు! టీమిండియాను వెనక్కినెట్టి..

2 Dec, 2022 10:04 IST|Sakshi
తొలిరోజే పాక్‌కు ముచ్చెమటలు పట్టించిన ఇంగ్లండ్‌ (PC: PCB)

Pakistan vs England, 1st Test: మ్యాచ్‌కు ముందు రోజు ఇంగ్లండ్‌ జట్టులోని పలువురు క్రికెటర్లు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడటంతో... తొలి టెస్టు నిర్ణీత సమయానికి మొదలవుతుందో లేదోనని సందేహం. అయితే గురువారం ఉదయం గం. 7:30కు తుది జట్టులో ఆడేందుకు 11 మంది కోలుకున్నారని ఇంగ్లండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పాకిస్తాన్‌ బోర్డుకు సమాచారం ఇచ్చింది. దాంతో నిర్ణీత సమయానికి ఇంగ్లండ్, పాకిస్తాన్‌ మధ్య తొలి టెస్టు మొదలైన విషయం తెలిసిందే.

అయితే.. ఇలా మ్యాచ్‌ మొదలయిందో లేదో ఇంగ్లండ్‌ జట్టు తొలి ఓవర్‌ నుంచే పరుగుల వరద పారించింది. టెస్టు మ్యాచ్‌లో టి20 మెరుపులను చూపించింది. జీవంలేని పిచ్‌పై పాక్‌ బౌలర్లు తేలిపోగా... ఇంగ్లండ్‌ జట్టులో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. ఫలితంగా 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో మ్యాచ్‌ రోజే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లండ్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.   

England tour of Pakistan, 2022-Rawalpindi: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై టెస్టు ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్‌ ఎవ్వరూ ఊహించనిరీతిలో విధ్వంసం సృష్టించింది. గురువారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ బ్యాటర్ల ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా... వెలుతురు మందగించి తొలి రోజు ఆటను ముగించే సమయానికి ఇంగ్లండ్‌ 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులు సాధించింది.

దంచికొట్టిన ఓపెనర్లు
ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలీ (111 బంతుల్లో 122; 21 ఫోర్లు), బెన్‌ డకెట్‌ (110 బంతుల్లో 107; 15 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), మిడిలార్డర్‌లో హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 101 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. హ్యారీ బ్రూక్‌తో కలిసి బెన్‌ స్టోక్స్‌ (15 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నాడు. జో రూట్‌ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఒక్కడే తక్కువ స్కోరుకు అవుటయ్యాడు.

73 ఫోర్లు, 3 సిక్స్‌లు
వెలుతురు మందగించడంతో తొలి రోజు నిర్ణీత 90 ఓవర్లకు బదులు 75 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. పూర్తి కోటా ఓవర్లు వేసిఉంటే ఇంగ్లండ్‌ స్కోరు 600 దాటేది. తొలి రోజు ఇంగ్లండ్‌ బ్యాటర్లు 73 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఈ మ్యాచ్‌తో పాక్‌ జట్టు తరఫున హారిస్‌ రవూఫ్, మొహమ్మద్‌ అలీ, సౌద్‌ షకీల్, జాహిద్‌ మొహమ్మద్‌... ఇంగ్లండ్‌ జట్టు తరఫున లివింగ్‌స్టోన్, విల్‌ జాక్స్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశారు.  

మరి ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు పరిశీలిద్దామా?!
ప్రపంచ రికార్డు
రావల్పిండి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్‌ సాధించిన పరుగులు 506. 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో మ్యాచ్‌ తొలి రోజే ఏ జట్టూ 500 పరుగులు చేయలేదు. 1910లో సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియా 6 వికెట్లకు 494 పరుగులు సాధించింది. 112 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును గురువారం ఇంగ్లండ్‌ జట్టు బద్దలు కొట్టింది.

ఇదే తొలిసారి
టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజే ఓ జట్టు తరఫున నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే ప్రథమం. జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, హ్యారీ బ్రూక్‌ కలిసి ఈ ఘనత సాధించారు.

టీమిండియా రికార్డు బద్దలు
పాక్‌తో తొలి టెస్టు తొలి సెషన్‌లో (లంచ్‌ సమయానికి) ఇంగ్లండ్‌ 27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా చేసిన పరుగులు 178. గతంలో ఏ జట్టూ తొలి సెషన్‌లో ఇన్ని పరుగులు చేయలేదు. 2018లో అఫ్గానిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి సెషన్‌లో భారత్‌ 27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. ఈ రికార్డును ఇంగ్లండ్‌ సవరించింది. 

ఐదో క్రికెటర్‌గా
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సౌద్‌ షకీల్‌ వేసిన 68వ ఓవర్లో  హ్యారీ బ్రూక్‌ వరుసగా ఆరు ఫోర్లు కొట్టి ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో సందీప్‌ పాటిల్‌ (భారత్‌; 1982లో బాబ్‌ విల్లిస్‌ (ఆస్ట్రేలియా) బౌలింగ్‌లో), గేల్‌ (విండీస్‌;20 04లో హోగార్డ్‌ (ఇంగ్లండ్‌) బౌలింగ్‌), శర్వాణ్‌ (వెస్టిండీస్‌; 2006లో మునాఫ్‌ పటేల్‌ (భారత్‌) బౌలింగ్‌లో), జయసూర్య (శ్రీలంక; 2007లో అండర్సన్‌ (ఇంగ్లండ్‌) బౌలింగ్‌లో) ఈ ఘనత సాధించారు.  

చదవండి: IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్‌! ఇక అంతే సంగతి
BCCI Chief Selector:టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ రేసులో మాజీ స్పీడ్‌ స్టర్‌..!

మరిన్ని వార్తలు